Telugu Gateway
Telangana

టెన్షన్ లో టీఆర్ఎస్...తమ్ముడి వ్యాఖ్యలకు అన్న ఖండన

టెన్షన్ లో టీఆర్ఎస్...తమ్ముడి వ్యాఖ్యలకు అన్న ఖండన
X

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు ఊహించని షాక్ లు. ఓ వైపు 105 సీట్లు ఒకేసారి ప్రకటించి టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. దీంతో ఒక్కసారిగా అసంతృప్తులు..అలకలు మొదలయ్యాయి. ఇవే పార్టీకి తలనొప్పిగా మారిన తరుణంలో ఎంఐఎం కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ లో ఎన్నికలు వస్తాయి..డిసెంబర్ లో ముఖ్యమంత్రి అవుతా అని కెసీఆర్ చెబుతున్నారు. కర్ణాటకలో అతి తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి సీఎం అయ్యారు. మేం కావద్దా అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. అక్భరుద్దీన్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని షాక్ కు గురిచేశాయని చెప్పొచ్చు. అక్భురుద్దీన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కొన్ని ఛానళ్లు కూడా ఈ వ్యాఖ్యలను ప్రసారం చేశాయి. దీంతో టీఆర్ఎస్ నివ్వెరపోయింది. వెంటనే రంగంలోకి దిగి దిద్దబాటు చర్యలు చేపట్టింది. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో మీడియాతో మాట్లాడించారు. తెలంగాణలో సీఎం అయ్యేంత నాయకుడు కెసీఆర్ తప్ప ఎవరూ లేరని...అక్భరుద్దీన్ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారు.

అంటే తమ్ముడి వ్యాఖ్యలకు అన్న ఖండన అన్న మాట. నాలుగు సంవత్సరాలుగా కెసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని..ఆయనే తిరిగి అధికారంలోకి వస్తారని అసదుద్దీన్ తెలిపారు. అంతే కాదు..కాంగ్రెస్, టీడీపీ పొత్తులను కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇంత కాలం బిజెపితో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ తో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అన్న విషయం అందరికీ తెలిసిందే అని తెలిపారు. మొత్తానికి తాత్కాలికంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను అయితే ఖండింప చేశారు. కానీ అసెంబ్లీ హంగ్ అయితే నిజంగా ఏదైనా జరగొచ్చు. తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత రసకందాయంలో పడటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it