Telugu Gateway
Politics

చంద్రబాబుకు కెటీఆర్ ‘పంచ్’

చంద్రబాబుకు కెటీఆర్ ‘పంచ్’
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖల మంత్రి కెటీఆర్ ‘పంచ్’ ఇఛ్చారు. ‘తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ను కట్టిన మహా నాయకుడు చంద్రబాబునాయుడు. మరి ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు. స్ట్రెయిట్ గా అడుగుతున్నా’ ఇవీ ఓ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు. గత కొంత కాలంగా చంద్రబాబునాయుడు ఏ వేదిక దొరికినా హైదరాబాద్ నిర్మాణంలో తన పాత్ర ఉందంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ‘హైటెక్ సిటీ’ నిర్మాణం ప్రారంభించటం..ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు హైదరాబాద్ రావటంతో ‘సైబరాబాద్’ రూపాంతరం చెందింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) కూడా చంద్రబాబు జమానాలోనే వచ్చింది.

అయితే హైదరాబాద్ కు పలు ప్రతిష్టాత్మక ఐటి సంస్థలను తేవటంలో చంద్రబాబు కృషి ఉన్నా..ఆయన ఆ విషయం కాకుండా..హైదరాబాద్ నిర్మాణంలోనే తన పాత్ర ఉందంటూ క్లెయిం చేసుకోవటం నిత్యం వివాదస్పదం అవుతోంది. తాజాగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవలోవే. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా కొత్త రాజధాని నిర్మించే అద్భుత అవకాశం చంద్రబాబుకు దక్కింది. అయితే ఆయన గత మూడున్నర సంవత్సరాలుగా ‘డిజైన్ల’తోనే కాలక్షేపం చేశారు తప్ప..శాశ్వత రాజధానికి సంబంధించిన పనులు ఏమీ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అందుకే కెటీఆర్ వ్యాఖ్యలు ఒకింత చంద్రబాబును ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నది తొమ్మేదేళ్లు. ఆయన చెప్పుకుంటున్నట్లు హైదరాబాద్ ను చంద్రబాబు తొమ్మిదేళ్లలో కడితే..ఐదేళ్ళ కాలంలో మరి అమరావతి ఏ స్థాయిలో నిర్మాణం జరగాలి?. కానీ ఎందుకు జరగలేదు?. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలుపునకు ఆయన ‘అనుభవం’ అనే అంశం కూడా కలిసొచ్చింది. కానీ ఆయన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో వమ్ము అయ్యారనే చెప్పొచ్చు.

Next Story
Share it