Telugu Gateway
Telangana

కాంగ్రెస్ తోక పార్టీగా టీడీపీ

కాంగ్రెస్ తోక పార్టీగా టీడీపీ
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా మంత్రి కెటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి టీడీపీ పెడితే..చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ తోక పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు.. తెలంగాణకు అడ్డంపడ్డ రెండు గడ్డాలు ఇవాళ ఒక్కటవుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్,టీడీపీ హయాంలో కరెంటు లేక తెలంగాణ రైతులను విద్యుత్ కోతలతో సతాయించారన్నారు. అరకొర కరెంట్ ఇచ్చి మొత్తం రాష్ట్రాన్నే దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టిన ఆ ఇద్దరు ఒకవైపు, 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకిస్తున్న కేసీఆర్ మరొక వైపు అని కేటీఆర్ అన్నారు. 65 ఏళ్లలో ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేదని, నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారితో 2 లక్షల మందిని బాధపడే విధంగా చేసిన చంద్రబాబు, ఉత్తమ్ ఒకటయ్యారని కేటీఆర్ విమర్శించారు.

కేవలం నాలుగేళ్లలోనే ఇంటింటికి నీళ్లు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరోవైపు ఉందని ఆయన అన్నారు. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతున్న కాంగ్రెస్ కావాలా.. రైతు బంధుతో ఆదుకుంటున్న టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. ఓ వైపు ఎన్నికలకు సిద్ధమంటారు. మరో వైపు తొందరేముందని ఈసీకి చెబుతారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డితోపాటు మరి కొంత మంది నేతలు టీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా మాట్లాడుతూ కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it