Telugu Gateway
Telangana

కొంగరకలాన్..కెటీఆర్ ఫెయిల్యూర్ స్టోరీ!

కొంగరకలాన్..కెటీఆర్ ఫెయిల్యూర్ స్టోరీ!
X

హరీష్ ను కాదని..కెటీఆర్ కు అప్పగిస్తే ఏమైంది?. ఇది టీఆర్ఎస్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఓ రాజకీయ పార్టీ సభకు నాలుగైదు లక్షల మంది జనం హాజరైతే అది విజయవంతం అయినట్లే. కానీ 25 లక్షల మంది వస్తారని హోరెత్తించిన సభకు కేవలం నాలుగైదు లక్షల మంది మాత్రమే వస్తే..అది సూపర్ సక్సెసా?. ఫ్లాపా?. చేసుకున్న ప్రచారానికి..వచ్చిన జనాలను చూస్తే సభ ఫెయిల్ అయినట్లే లెక్క. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు. రాజకీయ వ్యూహాలు అమలు చేయటంతోపాటు..సభలను సక్సెస్ చేయటంలో హరీష్ ది అందె వేసిన చెయ్యి. కానీ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా హరీష్ రావును పక్కన పెట్టి కెటీఆర్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొంగరకలాన్ బహిరంగ సభ బాధ్యతను కూడా కెసీఆర్ తన కొడుకు, మంత్రి కెటీఆర్ కు అప్పగించారు. కానీ తీరా సభ జరిగిన తీరు చూసిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు..శ్రేణులు కూడా నిశ్చేష్టులయ్యారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు 25 లక్షల మందితో సభ అని ప్రకటించినా..కనీసం 8 నుంచి 9 లక్షల మంది వస్తారని అంచనా వేశారు నాయకులు.

కానీ కొంగరకలాన్ సభకు హాజరైన వారి సంఖ్య ఏ లెక్కన చూసుకున్నా 4 నుంచి 5 లక్షలకు మించే ఛాన్స్ లేదని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. అట్టహాసంగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి..ప్రజలంతా తమ పక్కనే ఉన్నారని చెప్పుకుని రాజకీయ రణక్షేత్రంలో దిగాలని యోచించిన కెసీఆర్ కు ఈ సభ భారీ నిరాశే మిగిల్చింది. హెలికాప్టర్ లోనూ..తర్వాత హాజరైన జనాలను చూసి సీఎం కెసీఆర్ మూడ్ ఆఫ్ అయి అత్యంత సాదాసీదాగా చప్పగా ప్రసంగాన్ని ముగించారని చెబుతున్నారు. లేదంటే అది అసలు కెసీఆర్ స్పీచేనా? అని అందరూ పోయిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తుందో ప్రజల అనుభవంలో ఉందని చెప్పినప్పుడు ఏకంగా డిపోలకు డిపోలను మూసేసి..బస్సులన్నింటిని సభకు తరలించి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది?. ఓఆర్ఆర్ కు ఇష్టానుసారం మట్టి ర్యాంప్ లతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఏముంది?.

ఎలాగూ కెసీఆర్ మీడియాలో మాట్లాడినా తెలంగాణలో లక్షలాది మంది చూస్తారు కదా?. దీనికి ఇంత హంగామా ఎందుకు?. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభను సక్సెస్ చేయటంలో కెటీఆర్ విఫలం అయ్యారనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ అంశంపై టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘సభను సక్సెస్ చేయటం అంటే ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత ఈజీ కాదని ’ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కు ఈ సభ నిరాశనే మిగిల్చింది. హరీష్ రావును ఫీల్డ్ లో దించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

Next Story
Share it