Top
Telugu Gateway

కెసీఆర్..కెటీఆర్ లపై కొండా సురేఖ ఫైర్

కెసీఆర్..కెటీఆర్ లపై కొండా సురేఖ ఫైర్
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్, మంత్రి కెటీఆర్ పై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో మంత్రి కెటీఆర్ ఎన్ని సెటిల్ మెంట్లు చేస్తున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. ప్రతి పనిలో కెటీఆర్ ఎంత పర్పంజేజీలు తీసుకుంటారో తమకు తెలుసన్నారు. కెటీఆర్ ను ఎమ్మెల్యే, మంత్రి చేయాలని ఎవరు డిమాండ్ చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కెటీఆర్ ను సీఎం చేసేందుకే ఆ డ్రామా అంతా అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవదు..కెటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోకతప్పదు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారైనా సీఎం కెసీఆర్ ప్రజలను కలిశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది తుగ్లక్‌ పాలన అని, ధనికులకే మేలు చేసేవిధంగా ఆయన అన్యాయమైన పాలన చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. కేసీఆర్‌ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అధిష్టానానికి తాము లేఖ రాశామని, తమ లేఖపై టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం స్పందిస్తారని ఆశించి పదిరోజులు వేచి చూశామని, కానీ తమకు నిరాశే ఎదురైందని అన్నారు. టికెట్‌ నిరాకరించి తమ ఆత్మాభిమానాన్ని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దెబ్బతీసిందని ఆమె మండిపడ్డారు. మౌనం అర్థాంగికారం అన్నట్టు ఈ విషయంలో కేసీఆర్‌ వ్యవహరించారని ఆమె అన్నారు. కొండా సురేఖ, మురళీ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ వెళ్తున్నారని విమర్శించారు. తన కుటుంబంలోని నలుగురికి కీలక పదవులు ఇచ్చుకున్నారని అన్నారు. రైతుబంధు పథకంతో ధనిక రైతులకే న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్‌ పాలన అవినీతి పాలనగా మారిందని ధ్వజమెత్తారు. ‘సోనియాను నాడు అమ్మ అన్నాడు.. నేడు దయ్యం అంటున్నాడు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తానని నిరుపేదలను కేసీఆర్‌ మోసం చేశాడు. తన ప్రభుత్వంలో ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. అమరవీరుల కుటుంబాల్లో ఒక్కరికి కూడా టికెట్‌ ఇవ్వలేదు. శ్రీకాంతచారి తల్లికి ఎందుకు టికెట్‌ ఇవ్వలేదు’ అనికొండా సురేఖ అన్నారు. బీసీ మహిళ అయినందునే తమను అవమానించారని..తమ తండ్రి చనిపోతే కనీసం పరామర్శించని కెసీఆర్..అదే ఎర్రబెల్లి దయాకర్ రావు తండ్రి చనిపోతే మాత్రం వచ్చి పరామర్శించారని అన్నారు. పుట్టిన రోజు ఆశీర్వాదం తీసుకునేందుకు ఆపాయింట్ మెంట్ కోరినా కెసీఆర్ పట్టించుకోలేదన్నారు.

Next Story
Share it