Telugu Gateway
Telangana

‘నిమ్స్’లో కొత్త క్యాన్సర్ బ్లాక్

‘నిమ్స్’లో కొత్త  క్యాన్సర్ బ్లాక్
X

నిమ్స్ లో కొత్త క్యాన్సర్ బ్లాక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్ ను గురువారం నాడు మంత్రులు కెటీఆర్, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దేశంలోనే అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటైన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ క్యాన్సర్‌ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ (నిమ్స్‌)లో అత్యాధునిక సదుపాయాలతో ఈ విభాగాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని పూర్తి అధునాతన వైద్య సదుపాయాలతో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేయడం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు మద్దతుగా ఎంఈఐఎల్‌ అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్‌ వార్డును నిర్మించడం కొనియాడదగినదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్‌ చైర్మన్‌ పిపిరెడ్డి, ఎండీ పివి కృష్ణారెడ్డి దగ్గరుండి అన్ని విభాగాలను మంత్రులకు చూపించారు. ఈ సందర్భంగా ఎండి పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడేళ్ళపాటు వార్డు నిర్వహణ వ్యయాన్ని ఎంఈఐఎల్‌ సంస్థ భరిస్తుందని వెల్లడించారు. అదే విధంగా క్రింది అంతస్థులోని క్యాన్సర్‌ వార్డును ఆధునీకరించేందుకు ఎండి పివి. కృష్ణారెడ్డి ముందుకు రావడం పట్ల సంస్థ వితరణను మంత్రులు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్‌ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ అంకాలజీ భవనాన్ని నిర్మించేందుకు సంకల్పించింది.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని రోగుల కోసం నిమ్స్‌లో కార్పొరేట్‌ తరహా అత్యాధునిక సౌకర్యాలతో అంకాలజీ భవనాన్ని నిర్మించింది. దాదాపు రూ.10 కోట్లు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్‌లో 18,000 చదరపు అడుగులు స్థలంలో నూతన భవనాన్ని నిర్మించింది మేఘా. ఈ భవన నిర్మాణాన్ని జూన్‌ 2017లో ప్రారంభించగా, కేవలం ఏడాది కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు క్యాన్సర్‌ బాధితులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించింది. పురుషుల వార్డుతో పాటు క్యాన్సర్‌ బాధితుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా మహిళల వార్డును, పిల్లల్లో సైతం క్యాన్సర్‌ వ్యాపిస్తుండటంతో వారికోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్‌ వార్డు, రక్త క్యాన్సర్‌ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డును నిర్మించింది ఎంఈఐఎల్‌.

Next Story
Share it