Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబుపై కెసీఆర్ ‘బిగ్ బాంబ్’!

0

ఓటుకు నోటు కేసులో రంగంలోకి దిగనున్న ఈడీ

ఆ ‘ఐదు కోట్ల’పై తేల్చాలంటూ ఈడీతో సహా కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ!

- Advertisement -

తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబు పడబోతుందా?. అంటే అవుననే చెబుతున్నాయి తెలంగాణ పోలీసు వర్గాలు. ఇది ఎలా అంటే ఓటుకు కేసుకు సంబంధించి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటువేస్తే  ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడుకున్నారు. అందులో భాగంగా తొలి దశలో 50 లక్షల రూపాయల బ్యాగ్ తో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా స్టీఫెన్ సన ఇంట్లో  పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ కు అవసరమైన ఐదు కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి?. మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? అన్నది తేలాల్సి ఉంది. 50 లక్షలు స్టీఫెన్ సన్ ఇంటికి చేర్చారు. అయితే మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి..ఎక్కడ ఉన్నాయో తేల్చాల్సిందిగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ లేఖలో ఈడీ ఒక్కటే రంగంలో దిగుతుందా? ఇతర ఏజెన్సీలు కూడా వస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొత్త సమస్యలు సృష్టించే అవకాశం కన్పిస్తోంది. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తాజాగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ లు తనను అరెస్టు చేయించేందుకు చూస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై  సీఎం కెసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బహిరంగంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఆయన్ను బ్రహ్మాదేవుడు కూడా కాపాడలేరు అని బహిరంగ సభలోనే విమర్శలు చేశారు. కానీ ఇప్పటివరకూ ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. అయితే ఇంత కాలం మౌనంగా ఉండి ఈ తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు డబ్బు విషయంలో ఈడీతోపాటు మరికొన్ని కేంద్ర ఏజెన్సీలకు లేఖ రాయటం వెనక ‘రాజకీయ’ కోణం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొత్తం మీద మరోసారి ఓటుకు నోటు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ,కాంగ్రెస్ లు జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఇది కూడా ఆపద్దర్మ సీఎం కెసీఆర్ కు ఏ మాత్రం రుచించటం లేదు. ఈ తరుణంలో వెలుగులోకి వస్తున్న వ్యవహారం రాజకీయాన్ని రసకందాయంలో పడేయటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే  తెలంగాణ పోలీసు అధికారుల లేఖ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగుతుందా?. దిగితే ఎప్పుడు వస్తుంది అన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో ఉంది.

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.