Telugu Gateway
Telangana

కెసీఆర్ పని కాంగ్రెస్ కు కలిసొస్తుందా!?

కెసీఆర్ పని కాంగ్రెస్ కు కలిసొస్తుందా!?
X

అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ముందస్తు ఎన్నికలే కాకుండా..ముందస్తు అభ్యర్ధుల ప్రకటన తమ పార్టీ నెత్తిన పాలు పోసినట్లు అయిందని కాంగ్రెస్ నాయకత్వం కుషీకుషీగా ఉంది. ఆ పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం కెసీఆర్ ముందస్తు అభ్యర్దుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ ఈజీగా 45 నుంచి 50 సీట్లను గెలిచేసినట్లే అని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకింత కష్టపడి ..మరో 10 నుంచి 15 సీట్లు గెలుచుకుంటే అధికారం తమదే అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. టీడీపీతోపాటు టీజెఎస్ వంటి పార్టీలతో సర్దుబాటు సుఖాంతంగా ముగిస్తే మాత్రం వార్ వన్ సైడ్ అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఎంత సాఫీగా ఈ పొత్తుల ప్రక్రియ ముగుస్తుంది అన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. కెసీఆర్ ఒకేసారి 105 సీట్లు ప్రకటించటంతో పలు జిల్లాలో ఇప్పటికే అసమ్మతి కుంపట్లు రాజుకున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కొండా దంపతులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. వరంగల్ లో ఈ ప్రభావం పార్టీపై ఖచ్చితంగా ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు కూడా కెసీఆర్ హ్యాండిచ్చారు. దీంతో ఆయన తానే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని సవాల్ విసురుతున్నారు.

ఇలాంటి ఘటనలు పలు జిల్లాల్లో ఉన్నాయి. అయితే సీట్లు ప్రకటించిన వారందరికీ కెసీఆర్ బీ ఫారాలు ఇస్తారనే నమ్మకం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా ఉంది. ఇది కూడా టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముందు సీట్లు ఇస్తున్నామని ప్రకటించి..తీరా కీలక సమయంలో హ్యాండ్ఇస్తే అది కాస్తా మరింత ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా అసెంబ్లీ రద్దు వంటి నిర్ణయాలు తీసుకోవటం కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతుందని చెబుతున్నారు. వాస్తు బాగా లేదని సచివాలయానికి రాకపోవటం, ఎవరో జ్యోతిష్యులు చెప్పారని అసెంబ్లీ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం కూడా ప్రజల్లోకి బాగా వెళ్లిందని కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. చూడాలి మరి అంతిమ పలితాలు ఎలా ఉంటాయో. మొత్తానికి తెలంగాణలోని తాజా పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కుషీకుషీగా ఉన్నారు.

Next Story
Share it