జగన్ పాదయాత్ర@3000 కిలోమీటర్లు
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొత్త మైలురాయికి చేరింది. ఇది పాదయాత్రల చరిత్రలో ఓ కొత్త రికార్డుగా చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే ఈ అరుదైన ఘట్టానికి చేరుకుంది. ఈ చారిత్రక ఘట్టానికి నిదర్శనంగా ఆ ప్రాంతంలో ప్రత్యేక ‘పైలాన్’ను ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. జగన్ 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ సభలకు హాజరైన జనాలను చూసి రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో అధికారానికి దూరమైన జగన్ ఈ సారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
విజయనగరం జిల్లాలోని కొత్తవలస వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయనగరంలో పూర్తి చేసుకుని శ్రీకాకుళంలోకి అడుగుపెడితే పదమూడు జిల్లాలో పాదయాత్ర పూర్తయినట్ల అవుతుంది. అయితే ఇది అక్టోబర్ నెలాఖరుకు పూర్తవుతుందా? లేక నవంబర్ వరకూ సాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో అధికారాన్ని దక్కించుకున్నారు. అదే తరహాలో చంద్రబాబు కూడా పాదయాత్రతో అధికార పీఠం అధిష్టించారు. మరి ఇదే పాదయాత్ర జగన్ కు అధికార పీఠం అందిస్తుందా? లేదా వేచిచూడాల్సిందే.