చంద్రబాబు..లోకేష్ లో టెన్షన్ ..టెన్షన్!
ప్రస్తుతం తెలంగాణ కేంద్రంగా సాగుతున్న ఐటి దాడుల టెన్షన్ త్వరలోనే ఏపీకి వెళ్ళనుందా?. అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఓటుకు నోటు కేసులో నగదుకు సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని తొలుత తెలుగుగేట్ వే. కామ్ వెలుగులోకి తెచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే ఐటి అధికారులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది అంతా పక్కా పథకం ప్రకారమే సాగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్క రేవంత్ రెడ్డి ఇంట్లోనే కాకుండా ఓటుకు నోటు కేసులో భాగస్వాములు ఉన్న సెబాష్టియన్ తదితర ఇళ్ళపై కూడా ఐటి దాడులు జరిగాయి. ఇక మిగిలింది ఈ కేసులో కీలక పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్ లో ఆగకుండా వెంటనే అమరావతి వెళ్ళిపోయారు.
అరకు పర్యటన ఉందనుకోండి. మంత్రి నారా లోకేష్ పాడేరు పర్యటన రద్దు అయింది. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ పై భారీ బాంబు వేసిన వాళ్ళే..త్వరలోనే చంద్రబాబుపై కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అటు టీఆర్ఎస్, ఇటు బిజెపిలు ఐటి దాడులతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నా..దీని వెనక ఎవరు ఉన్నారో ఊహించటం పెద్ద కష్టం కాదు. పెండింగ్ లో ఉన్న ఓటుకు నోటు కేసుతో పాటు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం తమ వరకూ వస్తే అనుసరించాల్సిన టెన్షన్ లో చంద్రబాబు, లోకేష్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోనూ త్వరలో భారీ ఝలక్ ఉండటం ఖాయం అని చెబుతున్నారు.