Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డిపై ‘రాజకీయ కుట్రే’ నిజమా!

రేవంత్ రెడ్డిపై ‘రాజకీయ కుట్రే’ నిజమా!
X

అసలు ఐటి దాడులకు రామారావు ఫిర్యాదుకు లింకేంటి?

ఎంపిక చేసిన మీడియా సంస్థల ద్వారా ‘టార్గెట్ రేవంత్’ ఆపరేషన్

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తప్పు చేస్తే శిక్షించటాన్ని ఎవరూ ఆక్షేపించరు. ఆక్షేపించాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ తాజాగా జరిగిన ఐటి దాడులు...రేవంత్ రెడ్డిపై జరిగిన ప్రచారం అంతా ‘రాజకీయ కుట్ర’లో భాగంగానే అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకు ఉదాహరణలు ఎన్నో. ఐటి దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి జరిగిన పరిణామాలు ఇందుకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి పై జరిగిన సోదాల సమయంలో ఎంపిక చేసిన మీడియా సంస్థల్లో జరిగిన అంశాలే ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. అది ఎలాగో మీరూ ఓ సారి చూడండి. రేవంత్ రెడ్డి అక్రమాలపై న్యాయవాది రామారావు ఫిర్యాదు చేసింది సీబీఐకి. కానీ రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది ఐటి శాఖ అధికారులు. పోనీ ఐటి శాఖ అధికారులు ఎక్కడైనా అధికారికంగా కానీ..అనధికారికంగా రామారావు ఫిర్యాదు ఆధారంగా దాడి చేస్తున్నట్లు చెప్పలేదు?. సహజంగా ప్రైవేట్ వ్యక్తులు బ్లాక్ మనీ వివరాలు అందిస్తే వారికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి..పేరు అత్యంత రహస్యంగా ఉంచుతుంది.

కానీ రామారావు ఫిర్యాదుగానే ఇది అంతా జరిగింది అన్నట్లు ఎంపిక చేసిన టీవీ ఛానళ్లు..పత్రికలు ప్రచారం చేయటం వెనక ఉద్దేశం ఏంటి?. నిజంగా రామారావు ఫిర్యాదు ఆధారంగానే ఇదంతా చేశారు అనుకుంటే ఐటి అధికారులు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపాటు సహ నిందితులు అయిన సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్ళలో ఐటి సోదాలు ఎందుకు జరుపుతారు?. రామారావు వాళ్ళపై ఫిర్యాదు చేయలేదు కదా?. వాళ్లను..రేవంత్ రెడ్డిని ఒకే చోట కూర్చోపెట్టి ఎందుకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది?. అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటి దాడులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఓటుకు నోటు కేసులో పట్టుబడిన ఆ 50 లక్షల మనీ ట్రయల్ లో భాగంగానే జరిగాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే అంశంపై ఫోకస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వమే కక్ష కట్టి రేవంత్ రెడ్డిపై దాడులు చేయిస్తుందనే విమర్శలు వస్తాయని...రామారావును తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే అడగకుండానే పలు ప్రముఖ మీడియా సంస్థలకు రేవంత్ రెడ్డి అక్రమాలు ఇవిగో అండీ అంటూ 70 పేజీల స్పైరల్ బైండింగ్ పేపర్లు పంపారు. అంతే కాదు..ఫిర్యాదుదారు రామారావు తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డికి హాంకాంగ్ తోపాటు పలు దేశాల్లో ఖాతాలు ఉన్నాయని చెబుతున్నారు?

మీడియా కూడా దీనికి విస్తృత ప్రచారం కల్పించింది?. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఖాతా వివరాలను మరొకరికి ఇవ్వరు?. మరి రేవంత్ రెడ్డి విదేశీ ఖాతాల వివరాలు..ఆయన బ్యాంకు ఖాతాలు.. చెక్కుల నెంబర్లు రామారావుకు ఎలా దక్కాయి. అవే నిజం అయితే...ప్రభుత్వ ఏజెన్సీల సాయం లేకుండా అవి దక్కించుకోవటం సాధ్యం అవుతుందా?. విదేశీ ఖాతాలు వివరాల కావాలంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఏదైనా కేసు నమోదు చేసి...ఆ కేసు ఆధారంగా ఎంబసీల ద్వారా ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వివరాలు తెప్పించుకోవాల్సి ఉంటుంది?. అలాంటిది అంత తేలిగ్గా అడ్వకేట్ రామారావు చేతికి రేవంత్ రెడ్డివిగా చెబుతున్న విదేశీ ఖాతాల నెంబర్లు..లావాదేవీలు..ఇతర వివరాలు ఎలా వచ్చాయి?. ఐటి దాడులకు రామారావు ఫిర్యాదుకు సంబంధం లేకపోయినా కొన్ని మీడియా సంస్థలు అయితే ఓ పుస్తకం ఆధారంగా ఏకంగా రేవంత్ రెడ్డికి వేల కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చేశాయి?. గతంలో ఎన్నడూలేని తరహాలో రెండు రోజుల పాటు సోదాలు జరిపిన ఐటి అధికారులు రేవంత్ రెడ్డికి ఓ నోటీసు ఇచ్చి..మూడు సూటు కేసుల్లో వివరాలు తీసుకుని వెళ్లిపోయారు?. మరి నెక్ట్స్ ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it