ప్రపంచ విమానయానంలో భారత్ కు మూడవ స్థానం
విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటిఏ) లెక్కల ప్రకారం మొదటి స్థానంలో అమెరికా ఉంటే..రెండవ స్థానంలో చైనా..మూడవ స్థానంలో భారత్ ఉన్నాయి. 2017 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 400 కోట్ల మంది ప్రయాణాలు సాగించారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉన్నాయి. ఇందులో అమెరికా నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 63.2 కోట్ల మంది అయితే...చైనా నుంచి 55.5 కోట్ల మంది, భారత్ నుంచి 16.1 కోట్ల మంది ప్రయాణాలు సాగించారు. భారత్ ప్రపంచ విమాన ప్రయాణికుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నా కూడా అమెరికా, చైనా ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్లే లెక్క. విమాన ప్రయాణికుల విషయంలో యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీలు భారత్ కంటే వెనకబడి ఉండటం గమనార్హం. దేశంలో విమానయాన రంగానికి ఉన్న అవకాశాలను గమనంలోకి తీసుకుని కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై భారీ ఎత్తున ఫోకస్ పెడుతోంది.
ఓ అంచనా ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి విమానయానం చేయాలనుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలికసదుపాయాలు కానీ, విమానాల సంఖ్య ఏ మాత్రం సరిపోయే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది ప్రతి ఏటా దేశీయ విమానయాన రంగం ప్రగతి రేటు 18 నుంచి 20 శాతం మేర ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇంథనంగా ఉపగియోగించే ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు అడ్డగోలుగా పెరుగుతుండటంతో దేశీయ విమానయాన రంగం తీవ్ర సమస్యల్లో పడుతోంది. పలు ఎయిర్ లైన్స్ ఈ సమస్యను అధిగమించేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించి..మౌలికసదుపాయాలను మెరుగు పరిస్తే దేశీయ విమానయాన రంగం మరింత ప్రగతి సాధించే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.