Telugu Gateway
Telangana

‘ఇండియా టుడే’ కె. లక్ష్మణ్ ను గుర్తించదా?

‘ఇండియా టుడే’ కె. లక్ష్మణ్ ను గుర్తించదా?
X

మీడియా రంగంలో గుర్తింపు ఉన్న సంస్థల్లో ఇండియా టుడే ఒకటి. కానీ తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేకు సంబంధించి ఓ అంశం వివాదస్పదం అవుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం కె. లక్ష్మణ్ ను నియమించి రెండేళ్ళుపైనే అయింది. కానీ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో మాత్రం కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చూపించి సర్వే చేసిందా?. సర్వే ప్రసారం చేసిన సమయంలో టీవీలతోపాటు..పత్రికల్లోనూ కిషన్ రెడ్డి ఫోటోలే వచ్చాయి తప్ప..ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ను మాత్రం విస్మరించారు. ఇది ఎలా సాధ్యం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అన్ని పార్టీలకు సంబంధించి పార్టీ అధ్యక్షులను ప్రాతిపదికగా తీసుకుని ఒక్క బిజెపి విషయంలో మాత్రం మాజీ అధ్యక్షుడిని ఎలా తీసుకుంటారు?. అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేలో కెసీఆర్ కు అనుకూలంగా 43 శాతం మంది అభిప్రాయం చెప్పగా..కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 18 శాతం, బిజెపి తరపున కిషన్ రెడ్డికి 15 శాతం, టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంకు అనుకూలంగా 6 శాతం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే సర్వే వెల్లడించింది.

తెలంగాణలో బిజెపికి అనుకూలంగా వ్యక్తం అయిన సానుకూలతపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి తెలంగాణలో గత కొంత కాలంగా కెసీఆర్ తో సానుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది. తొలుత రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలని చూసింది. తర్వాత ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ ల మధ్య సఖ్యత పెరగటంతో బిజెపి దూకుడు తగ్గించింది. ముఖ్యంగా జాతీయ అధిష్టానం సానుకూల ధోరణితో తెలంగాణ బిజెపి ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ధీటుగా 15 శాతం సానుకూలత వస్తుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it