Telugu Gateway
Telangana

హరీష్ సక్సెస్...కెటీఆర్ కు మైనస్

హరీష్ సక్సెస్...కెటీఆర్ కు మైనస్
X

రాజకీయ వ్యూహాలు అమలు చేయటం. బహిరంగ సభలను సక్సెస్ చేయటంలో మంత్రి హరీష్ రావు ది అందె వేసిన చేయి. ఈ విషయం టీఆర్ఎస్ శ్రేణులందరికీ తెలుసు. కానీ ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా తన తనయుడు, మంత్రి కెటీఆర్ ను ప్రమోట్ చేయటానికి హరీష్ రావును దూరం పెట్టారు. టీఆర్ఎస్ లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది కూడా. అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకుని ..నగర శివార్లలో రెండు వేల ఎకరాల్లో కొంగరకలాన్ వద్ద 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసి.. ఆ బాధ్యతలను కెటీఆర్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అది కాస్తా జన సమీకరణలో ఫ్లాప్ అయింది. ఆ ప్రభావం మంత్రి కెటీఆర్ పై పడింది. హరీష్ రావును విస్మరిస్తే కష్టం అని గ్రహించిన కెసీఆర్ వెంటనే హుస్నాబాద్ సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. దీంతో హరీష్ రావు తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి హుస్నాబాద్ సభను సూపర్ సక్సెస్ చేశారు. కొంగకకలాన్ సభకు..హుస్నాబాద్ సభకు తేడా ఉన్నప్పటికీ హరీష్ ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే కొంగరకలాన్ సభ బాధ్యతలను హరీష్ కు అప్పగిస్తే ఆ సభ కూడా కనీసం ఫెయిల్యూర్ ముద్ర వేసుకునేది కాదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు..వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుకు అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్షాలు అన్నీ ప్రస్తుతం ఎలాగైనా కెసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. పైకి సీఎం కెసీఆర్, మంత్రులు వంద సీట్లు గ్యారంటీ అని చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అంత సానుకూలంగా లేవనే విషయం తెలిసిందే. అందుకే కొన్ని సీట్ల బాధ్యతను హరీష్ కు అప్పగించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కెసీఆర్ కూడా ఏకంగా వంద సభల్లో ప్రసంగించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it