పుష్కర మరణాలు..చంద్రబాబు తప్పేమిలేదట
గోదావరి పుష్కర మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పేమీలేదట. ఈ విషయాన్ని సర్కారు నియమించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చింది. 2015 పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 27 మంది మృత్యువాత పడటానికి ప్రధాన కారణం మీడియానే అని కమిషన్ తేల్చింది. ఇందులో చంద్రబాబు తప్పేమీలేదని పేర్కొంది. అంతే కాదు..ప్రమాదానికి కారణాలేంటో కనుక్కోమని చెపితే..కమిషన్ తన నివేదికలను చంద్రబాబును వెనకేసుకొస్తూ..రాజకీయ విమర్శల తరహాలో వ్యాఖ్యలు చేయటం విశేషం. నిర్దేశిత సమయంలో పుష్కర స్నానం చేస్తే మంచి జరుగుతుందని మీడియా అతి ప్రచారం చేయటం వల్లే ఎక్కువ మంది ఒకేసారి రావటం, మౌలికసదుపాయాలు సరిపోయేంతగా లేకపోవటం వల్ల ఈ ఘటన జరిగిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను బుధవారం నాడు ఏపీ అసెంబ్లీ ముందు పెట్టారు. గోదావరి పుష్కరాలపై మీడియా కంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి...అసలు పుష్కర స్నానాలు చేయకపోతే ఇక జన్మ వృధా అనే స్థాయిలో ప్రచారం హోరెత్తించింది సర్కారు. ఇఫ్పుడు మీడియానే పుష్కరాల్లో మరణాలకు కారణం అని నివేదిక ఇవ్వటం విశేషం.
పత్రికలు, చానళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది. పుష్కర దుర్ఘటనకు ముఖ్యమంత్రి కారణం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ప్రచారం, రాజకీయ లబ్ది కోసమే చాలామంది ఆరోపణలు చేసినట్టు కమిషన్ వ్యాఖ్యానించటం విశేషం. ఘాట్ వెడల్పు 300మీటర్లు మాత్రమే ఉండటం ప్రమాదానికి ఓ కారణంగా పేర్కొన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ వీడియోలతో సహా అన్ని వీడియోలను పరిశీలించిన కమిషన్ అధికారంలో లేని పార్టీలు, రాజకీయ శత్రుత్వం, ప్రతి అంశాన్ని విమర్శలకు వాడుకోవలనుకోవటం కమిషన్ గమనించింది. మృతులకు, బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం అందించిందని తెలిపింది. ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎక్కువ మంది చేశారని పేర్కొంది.