రాజీనామాకు సీఎం నిర్ణయం

గోవా సీఎం మనోహర్ పారికర్ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన సీఎం బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఆయన అమెరికాతో పాటు పలు చోట్ల చికిత్స పొందుతున్నా ఆరోగ్యం మెరుగుపడటం లేదు. దీంతో ఆయన విధులు నిర్వహించటం కష్టంగా మారిందని చెబుతున్నారు. ‘వినాయక చవితి సందర్భంగా అమిత్ షాకు పర్రీకర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తన అనారోగ్య సమస్యల గురించి వివరించి పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనికి సానుకులంగా స్పందించిన అమిత్ షా కొద్ది రోజుల వరకూ పదవిలో కొనసాగాలని కోరారు.
ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా పార్టీ కేంద్రం ఆలోచిస్తోంద’ని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రాంకియాటిస్‌తో బాధపడుతున్న పరీకర్ చికిత్స కోసం ఈ ఏడాది మార్చిలో అమెరికా వెళ్లారు. దాదాపు ఏడు నెలల తర్వాత సెప్టెంబరు 7న పరీకర్ భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో గోవాలోని కేండోలిమ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం ఆయన ఇప్పటివరకూ మూడుసార్లు అమెరికా వెళ్లివచ్చారు. తాజాగా ఆయన తిరిగి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లనున్నట్లు సమాచారం.