Telugu Gateway
Politics

రాహుల్ కు చంద్రబాబు ‘గ్రాండ్ వెల్ కమ్’!

రాహుల్ కు చంద్రబాబు ‘గ్రాండ్ వెల్ కమ్’!
X

‘రాహుల్ ద్రోహి. గో బ్యాక్ రాహుల్. ఎందుకు వస్తున్నారు ఆయన ఏపీకి. చేసిన గాయంపై మరింత కారం చల్లటానికి వస్తున్నారా?. లేకపోతే తాము చేసిన గాయం ఎలా ఉందో చూడ్డానికి వస్తున్నారా?’’ ఇవీ రాహుల్ గాంధీ గత ఏపీ పర్యటన సందర్భంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. అంతే కాదు..తెలుగుదేశం శ్రేణులు నల్లజెండాలతో ప్రదర్శన కూడా నిర్వహించాయి. రాహుల్ గ్యో బ్యాక్, రాహుల్ ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించాయి. ఆ ఫోటో కూడా ఈ ఐటెంలో చూడొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. రాహుల్ మంగళవారం నాడు కర్నూలు పర్యటనకు వస్తుంటే ఇంచుమించు చంద్రబాబు సర్కారు ఆయనకు ‘గ్రాండ్ వెల్ కమ్’ పలుకుతోంది. గతంలో చేసిన నిరసనలు లేవు...విమర్శలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని క్షమించేశారా?.

రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇఛ్చేస్తామన్న హామీ ఇవ్వగానే.. చంద్రబాబు చెప్పే విభజన గాయం మానిపోయిందా?. చంద్రబాబునాయుడు సంతృప్తి చెందిపోయారా?. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప...రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం ముఖ్యం కాదన్నది అర్థం చేసుకోవచ్చు. 2014లో వచ్చిన మెజారిటీ కంటే కొంత తగ్గినా మళ్ళీ కేంద్రంలో మోడీ సర్కారే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?. దాని వల్ల రాహుల్ ఏమి హామీ ఇచ్చిన ఉపయోగం ఉండదు కదా?. అంటే కేవలం రాజకీయ అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు తన నిర్ణయాలు..అభిప్రాయాలు మార్చుకుంటారు తప్ప..రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది సుస్పష్టం. అందుకే ఇప్పుడు ఏపీలో టీడీపీ సర్కారు రాహుల్ పర్యటనపై నోరెత్తటం లేదు. పైగా పరోక్షంగా సహకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ కాస్తో కూస్తో బలపడితే అది చంద్రబాబుకు లాభం కాబట్టి.

Next Story
Share it