Telugu Gateway
Politics

తెలంగాణ ఎన్నికలపై ఈసీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలపై ఈసీ కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అన్న ఉత్కంఠ రాజకీయ పార్టీలతో పాటు..రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. ఓ వైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..ఫలితాలు ఎప్పుడు వస్తాయో విలేకరుల సమావేశంలో చెప్పటంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై సీఈసీ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి లేఖ కూడా రాశారు. లేదంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో కేంద్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈసీ) ఓం ప్రకాష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రద్దు అయిన అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరు నెలలు కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. ఈ లెక్కన త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరగటం ఖాయంగా కన్పిస్తోంది. ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ చెప్పినట్లు కొత్త సంవత్సరానికి కొత్త ప్రభుత్వం కొలువుదీరటం ఖాయంగా కన్పిస్తోంది. సీఈసీ వ్యాఖ్యలతో తెలంగాణ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధత కూడా తొలగిపోయినట్లు అయింది.

Next Story
Share it