‘విశ్వరూపం2’ మూవీ రివ్యూ
ఒకప్పుడు కమల్ హాసన్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరు. కమల్ హీరోగా నటించిన కొత్త సినిమా విడుదలై చాలా రోజులే అయింది. విశ్వరూపం సినిమాకు కొనసాగింపుగా వచ్చిన విశ్వరూపం2 సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న ఈ సీనియర్ హీరో తన కొత్త సినిమాలో కొన్ని రాజకీయ డైలాగులను కూడా పేల్చారు. భవిష్యత్ ను వదిలేసి...ఇప్పటి అవసరాలు చూసుకోవటమేగా మన ‘సుపరిపాలన’ అంటూ ఎటాక్ చేశారు. విశ్వరూపం 2 సీక్వెల్ కావటంతో తొలి భాగం చూడనివారికి సినిమా ఒకింత గందరగోళంగానే ఉంటుంది. తొలి భాగంలో న్యూయార్క్ మిషన్ పూర్తి చేసిన విసామ్ (కమల్ హాసన్), మరో మిషన్ మీద లండన్ వెళ్తాడు. లండన్‌లో భారీ విధ్వంసాని జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజాకుమార్), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి చేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్ నుంచి తప్పించుకున్న అల్ ఖైధా తీవ్రవాది ఒమర్ ఖురేషీ (రాహుల్ బోస్) ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ లకు రంగం సిద్ధం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విసామ్, ఒమర్ ప్లాన్‌ను ఎలా అడ్డుకున్నాడు అన్నదే విశ్వరూపం 2 కథ. విశ్వరూపం 2 ఫస్టాఫ్ కాస్త హుషారుగా నడిచినట్లు కన్పించినా..సెకండాఫ్ మాత్రం బోర్ గా..స్లోగా ముందుకు సాగుతుంది.
అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకు మాత్రం ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేని స్థాయిలో చేశాడు తన పాత్రను. లేట్ వయస్సులోనూ యాక్షన్ సీన్స్ లో తనదైన స్టైల్ ను చూపించారు. అంతే కాదు..రొమాన్స్ విషయంలోనూ తానేమీ వెనకబడి లేనని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆర్మీ, రా అధికారుల సంభాషణలు...సంఘటనలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్, ఆండ్రియాలు ఇద్దరి పాత్రలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. ఆండ్రియా యాక్షన్ సీన్స్ లోనూ సూపర్ అన్పించేలా నటించారు. విలన్‌గా రాహుల్ బోస్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో కరడుగట్టిన తీవ్రవాదిగా మెప్పించాడు. తొలి భాగంతో పోలిస్తే విశ్వరూపం 2తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం కావటం.. సీక్వెల్‌లో చాలా సన్నివేశాలు తొలి భాగంతో లింక్ అయి ఉండటంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేరు. ఓవరాల్ గా చూస్తే విశ్వరూపం 2 సినిమా రెగ్యులర్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వటం కష్టమే.
రేటింగ్. 2.25/5