Telugu Gateway
Andhra Pradesh

పదిహేను సీట్లు ఇస్తే..మంచినీళ్లు కూడా ఇవ్వలేరా?

పదిహేను సీట్లు ఇస్తే..మంచినీళ్లు కూడా ఇవ్వలేరా?
X

‘పశ్చిమ గోదావరి జిల్లా గత ఎన్నికల్లో మీకు 15 సీట్లు ఇవ్వబట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అన్ని సీట్లు ఇచ్చిన జిల్లాకు మీరేమి ఇచ్చారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. జిల్లాలో ప్రజలు నీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. చంద్రబాబు అనుభవం ఏమీ ఈ జిల్లాకు ఉపయోగపడలేదు.’ అని ఏపీ సీఎం ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. బీజేపీని నానారకాలుగా తిట్టిపోస్తున్న సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో మళ్లీ ప్రధానమంత్రి మోదీతో జతకట్టి ఆయన చేయిపట్టుకుని ఓట్లకోసం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. మాటలు మార్చడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. కాంగ్రెస్‌ను తిట్టినతిట్టు తిట్టని ఆయన మొన్న రాజ్యసభలో వాళ్ల ఎంపీలతో కాంగ్రెస్‌కు ఓటేయించారన్నారు. అధికారంకోసం కులాలమధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు నైజమన్నారు. బీసీలు, కాపుల మధ్య, ఎస్సీల మధ్య, మత్స్యకారులు, ఎస్టీల మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. కాపు రిజర్వేషన్‌ అంశాన్ని కోల్ట్‌ స్టోరేజ్‌లో పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైతం కాపు రిజర్వేషన్‌పై మాటమార్చారన్నారు. కులాల్ని విభజించి అధికారంలోకి రావాలని జనసేన అనుకోదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అన్ని సీట్లు ఇవ్వకపోతే అవినీతితో వేలకోట్లు సంపాదించేవారా? మీ అబ్బాయి అందరి తలలపై ఎక్కి తొక్కే అవకాశం ఉండేదా? చెప్పండి. జిల్లాకు ఒక్క పరిశ్రమా లేదన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని ముందుకొస్తే మాకెంతిస్తారని స్థానిక ఎమ్మెల్యేలు అడుగుతున్నారన్నారు. మహిళా అధికారులపై దాడులు చేసే ఎమ్మెల్యేకు ఇక్కడ అందలం దక్కుతోందన్నారు. ఏ హామీనీ అమలు చేయని చంద్రబాబు మళ్లీ నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చుపెట్టి 2019 ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చును రూ.42 కోట్లకు పెంచినట్టు తెలుస్తోందన్నారు. మిమ్మల్ని ప్రజలెలా నమ్మాలి.. ఎందుకు ఓట్లెయ్యాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఇసుక మాఫియా, మైనింగ్‌ మాఫియా సొమ్ములు చంద్రబాబు వద్ద ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే ద్రోహం చేసుకున్నట్టేనన్నారు. వైసీపీ నేతలు కూడా వేల కోట్లు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికలకు రెడీ అవుతున్నారన్నారు.

Next Story
Share it