Telugu Gateway
Andhra Pradesh

ఇదేనా చంద్రబాబు ‘రియల్ టైమ్ గవర్నెన్స్’

ఇదేనా చంద్రబాబు ‘రియల్ టైమ్ గవర్నెన్స్’
X

‘రాష్ట్రంలో ఏ గ్రామంలో విద్యుత్ లైట్లు వెలగకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలుస్తుంది. ఏ ప్రాజెక్టు ఎంత మేరకు పూర్తవుతుందో లెక్కలతో సహా వస్తాయి. అలాంటిది చంద్రబాబుకు అక్రమ మైనింగ్ ఎందుకు తెలియటం లేదు. ఇదేనా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’?’ అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని పవన్‌కల్యాణ్ గారు అన్నారు. స‌చివాల‌యంలో కూర్చొని గ్రామాల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటాను... మాది రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పే ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు గారిని నిజానికి గ్రామాల్లో ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌న్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం తక్షణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జనసైనికులే వాటిని మూయిస్తారని చెప్పారు. సోమ‌వారం కర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఆలూరు మండ‌లం హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్వారీలో పేలుడు ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని, సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను గాలికొదిలేసి..మంత్రుల‌ను, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వెన‌కేసుకొచ్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని విమర్శించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే మైనింగ్ శాఖ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1300 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, మ‌రో 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story
Share it