పేపర్ బాయ్ మూవీ రివ్యూ
ఓ డబ్బున్న అమ్మాయి...పేపర్ బాయ్ ను ప్రేమిస్తుందా?. ప్రేమిస్తే ఆ ప్రేమను తల్లిదండ్రలు అంగీకరిస్తారా?. ఇదే అసలు పేపర్ బాయ్ సినిమా కథ. ఇదేదో..రెండుసార్లు చూపులు కలిపేసి..చేతులు ఊపేసుకుని తాము ప్రేమించుకుంటున్నాం అహో అని అరిచి చెప్పే ప్రేమికులు కాదు వీళ్ళిద్దరూ. ప్రతి రోజూ పేపర్లు వేసే అమ్మాయి ..తనకు నచ్చిన అమ్మాయికి సంబంధించిన అంశాలను నిత్యం పేపర్ లో హైలెట్ చేస్తూ వెళుతుంటాడు. ఓ రోజు అమ్మాయి పేపర్లు అన్నీ తిరగేస్తుంటే అసలు విషయం తెలుస్తుంది. తర్వాత వీరిద్దరి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని తెలుసుకుంటారు ఇద్దరూ. అందుకే ప్రేమకు ఓకే చెప్పేసుకుంటారు. కానీ ఓ పార్టీలో తన లవర్ గా పేపర్ బాయ్ ని పరిచయం చేసిన అమ్మాయి ఆ అబ్బాయి ఐబీఎంలో పనిచేస్తాడని...జీతం కూడా చాలా వస్తుందని అలవోకగా అబద్దం చెప్పేస్తుంది. దీనికి హర్ట్ అయిన అబ్బాయి వెళ్లిపోతాడు. తర్వాత మళ్లీ కలుస్తారు. చూడటానికి ఇది ప్రేమ సింపుల్ ప్రేమ కథలా ఉన్నా..ఇందులో ఎన్నో ట్విస్ట్ లు..మలుపులు. దీనికి తోడు కాస్త డెప్త్ ఉన్న సంభాషణలు ఎన్నో. మనం పెళ్ళికి కార్డులు రెడీ చేసుకుంటుంటే...నాకు దేవుడి దగ్గర నుంచే ఇన్విటేషన్ వచ్చింది. వై ఫై లేకపోయినా వాట్సప్ పనిచేస్తున్నట్లు అంత ఆనందం ఏంటిరా? అంటూ స్నేహితుల బనాయింపులు. ఇవీ స్థూలంగా పేపర్ బాయ్ సినిమా హైలెట్స్. హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో చలాకీ కుర్రాడిగా..ఓ పేదింటి పేపర్ బాయ్ గా మంచి హావభావాలు ప్రదర్శించాడనే చెప్పొచ్చు. ఏమోషనల్ సీన్స్ లోనూ మంచి నటన కనపర్చారు.
హీరోయిన్ రియా సుమన్ చాలా హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో రియా చూపించిన ఎమోషన్స్ సూపర్బ్. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్, మహేష్, బిత్తిరి సత్తి, అభిషేక్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు.ఈ తరహా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తకాకపోయినా సినిమా నడిపించిన విధానం బాగుంది. పాత కథనే కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్. సంపత్ నంది రచన సినిమాకు హెల్ప్ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. ఒకింత నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే పేపర్ బాయ్ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుంది.
రేటింగ్. 2.5-5