Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో ‘చంద్రబాబు’ టెన్షన్!

టీఆర్ఎస్ లో ‘చంద్రబాబు’ టెన్షన్!
X

ముందస్తు ఎన్నికల వ్యవహారం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు అయితే ఎవరి గొడవలో వారుంటారు. ఒకరిపై ఒకరు ఫోకస్ పెట్టుకునే సమయం ఉండదు. ఇఫ్పుడు ఒక్క తెలంగాణకు మాత్రమే ఎన్నికలు జరిగితే..టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తూ ఊరుకుంటారా?. అందులో ఏపీలో అధికారంలో ఉండి. చంద్రబాబు, కెసీఆర్ లు పైకి ఇద్దరం మంచి మిత్రులం..కలసి మెలసి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటాం అని చెబుతున్నా..ఛాన్స్ దొరికితే ఒకరినొకరు దెబ్బతీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో కూడా ఇదే భయం ఉంది. ఎన్నికలు అంటే చంద్రబాబుకు ఓ సరదా. దీని కోసం ఆయన ఎంత ఖర్చు అయినా పెడతారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనకాడరు అనే సంగతి రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి అవగతమే. తెలంగాణ సీఎం కెసీఆర్ కు కూడా ఈ సంగతి బాగా తెలుసు. ఏపీలో ఎన్నికలు లేకుండా..ఒక్క తెలంగాణలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..చంద్రబాబు తన అర్థ, అంగ బలాలను మొహరిస్తే పరిస్థితి ఏంటి? అన్నది టీఆర్ఎస్ నేతల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణలో చంద్రబాబు మాట ఎవరు వింటారు అని టీఆర్ఎస్ నేతలు వాదించవచ్చు కాక. కానీ గ్రేటర్ హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో టీడీపీ ఉనికిని ఎవరూ కాదనలేని సత్యం. నాయకులు పోయినా ఆ పార్టీ సానుభూతి పరులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లు సొంతంగా అభ్యర్ధులను గెలిపించుకోలేకపోవచ్చు. కానీ తమ ప్రత్యర్ధులను ఓడించటానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తారనటంలో సందేహం లేదు. ఓ వైపు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అసలు ముందస్తుకు ఒఫ్పుకుంటుందా? అన్న టెన్షన్ ఓ వైపు...విడిగా పోతే ‘టార్గెట్’ అవుతామా? అన్న భయం మరో వైపు. ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ ఛాన్స్ ఉందని బలంగా విన్పిస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఆర్థిక వనరులను సర్దుబాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని కొంత మంది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it