Telugu Gateway
Andhra Pradesh

నందమూరి హరికృష్ణ ఇక లేరు

నందమూరి హరికృష్ణ ఇక లేరు
X

సినిమాల్లో..రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నందమూరి హరికృష్ణ ఇక లేరు. బుధవారం ఉదయం నల్లగొండలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ప్రమాదం జరిగిన వెంటనే హరికృష్ణను నార్కట్ పల్లిలో ఉన్న కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. నెల్లూరులో జరిగే ఓ శుభకార్యానికి హాజర్యేందుకు వెళుతున్న సమయంలో హరికృష్ణ ఈ ప్రమాదం బారిన పడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. అత్యంత స్పీడ్ గా వెళుతున్న ఈ వాహనం డివైడర్ ను డీకొట్టి..పక్క మార్గంలో వెళ్లి..అటువైపు వెళ్లే వాహనాలను కూడా తాకిందని ప్రత్యక్ష సాక్ష్యుల కథనం. హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. హరికృష్ణ ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా...ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆయన చైతన్యరథానికి హరికృష్ణే సారధిగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నా కూడా గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. హరికృష్ణ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. ప్రమాద సమయంలో హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదని చెబుతున్నారు.

Next Story
Share it