Telugu Gateway
Politics

మోడీ అంత రిస్క్ చేస్తారా?.

మోడీ అంత రిస్క్ చేస్తారా?.
X

అసలు తొలి దశ జమిలి ఎన్నికల ప్రతిపాదన తెచ్చిందే ఆ రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేక ఫలితాలు వస్తాయనే. అలాంటిది ఓ సర్వే ఎంతో విస్పష్టంగా బిజెపికి గడ్డుకాలం తప్పదని తేల్చిచెప్పినా ప్రధాని నరేంద్రమోడీ అంత పెద్ద రిస్క్ చేస్తారా?. తాజా సర్వే నిజం అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీష్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో బిజెపికి ఇంటికిపోవాల్సిందే. ఈ ప్రభావం ఖచ్చితంగా తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలపై పడటం ఖాయం. కాంగ్రెస్ కు ఈ ఫలితాలతో ఊపు వస్తుంది. బిజెపి నైతికంగా బలహీనపడుతుంది. మరి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవటానికి ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు సిద్ధంగా ఉన్నారా?. ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ‘రాఫెల్’ కుంభకోణాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇది అతి పెద్ద స్కామ్ గా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ తోపాటు కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వంటి వారు కూడా రాఫెల్ డీల్ పై విమర్శలు చేయటం విశేషం. ఈ తరుణంలో మోడీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలే వెళతారా? లేక ముందు నుంచి అనుకుంటున్నట్లు డిసెంబర్ లోనే ఎంపిక చేసిన రాష్ట్రాలతో కలసి లోక్ సభకు కూడా ఎన్నికలు జరిపించటానికి రెడీ అవుతారా?. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. అయితే తాజాగా వచ్చిన సర్వే ఫలితాలు జాతీయ స్థాయిలో మోడీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నా...అవి మారిపోవటానికి పెద్ద సమయం కూడా పట్టకపోవచ్చు.

ఓ సంఘటన చాలు అంతా తిరగబడటానికి. ఈ ఏడాది చివర్లో జరగనున్న చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బిజెపికి షాక్ తప్పదని తాజా సర్వే స్పష్టం చేసింది. సీఓటర్‌, ఏబీపీ న్యూస్‌ చేపట్టిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇమేజ్‌ బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. తాజా సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ 117 స్ధానాల్లో, చత్తీస్‌గఢ్‌లోని 90 స్ధానాల్లో 54 స్ధానాలు, రాజస్తాన్‌లోని 200 స్ధానాల్లో 130 స్ధానాల్లో గెలుపొంది కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టనుందని తేల్చారు. సర్వే అంచనాల ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించనుంది. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 106, 33, 57 స్ధానాలతో సరిపెట్టుకోవచ్చని సర్వే అంచనా వేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసిరానుంది. ఇంత స్పష్టమైన సంకేతాలు అందుతున్న తరుణంలో మోడీ మౌనంగా ఉంటారా?.

Next Story
Share it