Telugu Gateway
Telangana

కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో దిగొచ్చిన సర్కారు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో దిగొచ్చిన సర్కారు
X

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల సభ్యత్వ పునరుద్ధరణకు మార్గం సుగమం అయినట్లే కన్పిస్తోంది. శుక్రవారం నాడు హైకోర్టులో జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. కోర్టు తీర్పును అమలు జరిపేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని శాసనసభ కార్యదర్శి తరపు లాయర్ కోర్టుకు నివేదించటంతో ఈ విషయం స్పష్టం అవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు తీర్పు ఇచ్చినా..అమలు చేయకపోవటంతో కోమటిరెడ్డి, సంపత్ లు హైకోర్టులో ధిక్కార పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు అవసరం అయితే ఈ కేసులో స్పీకర్ ను కూడా ప్రతివాదిగా చేరుస్తామని ప్రకటించటంతో విషయం మరింత సీరియస్ గా మారింది. తమ నిర్ణయం ప్రకటించటానికి రెండు వారాల సమయం కావాలని అసెంబ్లీ తరపున న్యాయవాది కోరగా..వారంలోనే ఏమి చేస్తారో చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకర్‌రావు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుచితంగా వ్యవహరించారంటూ వీరిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టడం..సభ అప్పటికప్పుడు ఆమోదించటం జరిగిపోయిన విషయం తెలిసిందే. సభ్యత్వాల రద్దు వంటి ఎంతో తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు అసలు సభ్యుల వాదన వినే ప్రయత్నం కూడా చేయలేదు. రాజకీయ వర్గాల్లోనూ ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story
Share it