Telugu Gateway
Andhra Pradesh

ఎన్టీఆర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో పదవి!?..టీడీపీ వర్గాల్లో చర్చ

ఎన్టీఆర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో పదవి!?..టీడీపీ వర్గాల్లో  చర్చ
X

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొత్త చర్చ ప్రారంభం అయింది. నందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ కు టీడీపీలో పొలిట్ బ్యూరో పదవి ఇవ్వాలనే డిమాండ్ ప్రారంభం అవుతోంది. కొంత మంది నేతలు అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు ప్రారంభించారు. త్వరలోనే ఈ డిమాండ్ ను లేవనెత్తే అవకాశం ఉందని సమాచారం. దివంగత హరికృష్ణ ఇటీవల వరకూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనలేదు. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా ఆయన్ను దూరంగా పెట్టడమే. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు చనిపోవటం ఆయనకు పెద్ద షాక్ అయితే...రాజకీయంగా చంద్రబాబు తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవటం కూడా హరికృష్ణను బాధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని చాలా మంది నేతల వద్ద హరికృష్ణ బహిరంగంగానే ప్రస్తావించారని చెబుతారు. ఎన్టీఆర్ మరో తనయుడు బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రితోపాటు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కానీ హరికృష్ణ ఫ్యామిలీకి పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి సమయంలో హరికృష్ణ తన తండ్రిని ఎదిరించి మరీ చంద్రబాబు వైపున నిలబడటం అప్పట్లో చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది. తొలుత మంత్రి పదవి ఇచ్చినా..చంద్రబాబు క్రమంగా హరికృష్ణను దూరం పెడుతూ వచ్చారు. మధ్యలో ఓ సారి రాజ్యసభ పదవి ఇచ్చారు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా చంద్రబాబు ఓ దఫా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకుని..తన కొడుకును రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎన్టీఆర్ ను పక్కనపెట్టేశారు. అంతే కాదు..నారా లోకేష్ వంటి వారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పై వ్యంగ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హావభావాల ప్రదర్శనలో కానివ్వండి..స్పీచ్ లో కానివ్వండి ఎన్టీఆర్ ముందు నారా లోకేష్ నిలబడలేరు. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను దూరం పెట్టారు.

పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు, నారా లోకేష్ ల హవానే సాగుతోంది. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన తనయుడు ఎన్టీఆర్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలనే డిమాండ్ విన్పిస్తోంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ నిజంగా చంద్రబాబు ఆఫర్ చేసినా ఈ పదవి చేపడతారా? అన్నది సందేహమే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే హరికృష్ణ అనుకూలురు మాత్రం ఎన్టీఆర్ కు పదవి ఇవ్వాల్సిందేననే వాదనను తెరపైకి తెస్తున్నారు. అయితే హరికృష్ణ స్థానంలో పొలిట్ బ్యూరో పదవిని నందమూరి బాలకృష్ణకు అప్పగించి..ఎన్టీఆర్ ఫ్యామిలీని చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకునే అవకాశం లేకపోలేదనే వాదన కూడా విన్పిస్తోంది. చూడాలి చంద్రబాబు ఇఫ్పుడు కొత్త ఎత్తులు ఏమి వేస్తారో?.

Next Story
Share it