Telugu Gateway
Telangana

హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు

హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు
X

బంధు మిత్రులు..అభిమానుల అశ్రునయనాల మధ్య నందమూరి హరికృష్ణకు అంతిమ యాత్ర సాగింది. బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం మెహిదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి ఆయన అంతిమ యాత్ర సాగింది. ఇందులో వేలాది మంది అభిమానులు...రాజకీయ నేతలు..సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హరికృష్ణ భౌతికకాయాన్ని సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ లు వైకుంఠ వాహనం వరకు మోశారు. హరికృష్ణను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. హరికృష్ణ తనయుడ కళ్యాణ్ రామ్ తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులతోపాటు వేలాది మంది అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కెసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంతోపాటు..జూబ్లీహిల్స్‌ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించనున్నారు.

Next Story
Share it