Telugu Gateway
Movie reviews

‘గూఢచారి’ మూవీ రివ్యూ

‘గూఢచారి’ మూవీ రివ్యూ
X

చొర‌బాటు ( ఇన్ ఫిల్ట్రెట్). ప‌రిశోద‌న (ఇన్వెస్టిగేష‌న్), తెలియ‌జేయ‌టం (ఇన్ ఫార్మ్). ఇదే మూడు ఐల గూఢ‌చారి సినిమా. రిసెర్చ్ అనాల‌సిస్ వింగ్ లో ఉద్యోగ నియామ‌కాలు ఎలా ఉంటాయి?. వాళ్లు ఎంత ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తారు. వాళ్లు ఎలాంటి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారో తెలియ‌చెప్పేదే ఈ చిత్రం. నిత్యం ట్విస్ట్ లు..స‌స్పెన్స్ లు. ఊహించ‌ని ప‌రిణామాలతో సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల‌కు ఓ కొత్త‌ద‌నం చూపిస్తుంది. రొటీన్ ప్రేమ‌లు..సాంగ్స్ వంటివి లేకుండా సినిమా కూల్ గా ముందుకు సాగుతుంది. అయితే వెన్నెల కిషోర్ రూపంలో అక్క‌డ‌క్క‌డ న‌వ్వులు కూడా పూశాయ‌నుకోండి. అడివి శేష్ సినిమా అంటేనే ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌నే ప్రేక్షకులు అంచ‌నాల‌కు అనుగుణంగానే ఈ సినిమా ఉంది. హీరో తండ్రి చిన్న‌ప్పుడే టెర్ర‌రిస్టుల‌తో పోరాడే స‌మ‌యంలో మ‌ర‌ణిస్తాడు. దీంతో ప్ర‌కాష్ రాజ్ ఈ కుర్రాడిని పెంచి పెద్ద చేస్తాడు. చ‌నిపోయిన హీరో తండ్రి, ప్ర‌కాష్ రాజ్ ఆర్మీలో ప‌నిచేసే స‌మ‌యం నుంచి మంచి స్నేహితులు. హీరో తండ్రి కాల్పుల ఘ‌ట‌న‌లో మ‌ర‌ణిస్తాడు అనుకుంటారు. కానీ మ‌ర‌ణించ‌కుండా పాకిస్తాన్ కేంద్రంగా భార‌త్ లో విధ్వంసాలు చేస్తుంటాడు టెర్ర‌రిస్టుల సాయంతో. ఎలాగైనా ఐబీ, రా, సీబీఐ వంటి సంస్థ‌ల్లో ఉద్యోగం పొందేందుకు చేసే ప్ర‌య‌త్నాలు..చివ‌రిగా రాకు ఎంపికైన విధానం కూడా ప్రేక్షకుల‌కు కొత్త అనుభూతిని నింపుతుంది. రా అదికారిగా నియ‌మితుడైన త‌ర్వాత హీరో ప‌నిచేసే ఆగిపోయిన త్రినేత్ర మిష‌న్ ను తిరిగి ప్రారంభిస్తారు. రా అధికారుల‌పై టెర్రిరిస్టుల నిఘా ఎలా ఉంటుంది. ఉద్యోగుల ఎంపిక‌లో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే సంస్థ‌లోకి కుట్ర‌దారులు ఎలా జొర‌ప‌డ‌తారు అన్న‌ది ఆస‌క్తికరంగా చూపించారు. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు.

ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫి, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్‌ శానెల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్‌. క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కోరుకున్న ఉద్యోగం ద‌క్కించుకున్న హీరో ప‌డ్డ క‌ష్టాలు...క‌న్న తండ్రి ముఖ్య‌మా?. దేశం ముఖ్య‌మా అంటే ఎటు వైపు మొగ్గాలో చెప్పే క్లైమాక్స్ సీన్స్ కూడా సూప‌ర్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కామెడీని పండించ‌టంతో పాటు..చివ‌రిలో కుట్ర‌దారుల త‌ర‌పున ప‌నిచేసే వ్య‌క్తిగా రెండు పాత్ర‌ల‌ను అల‌వోక‌గా చేశాడ‌నే చెప్పొచ్చు. ఓవ‌రాల్ గా చూస్తే కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్షకుల‌కు మంచి అనుభూతిని మిగుల్చుతుంది.

రేటింగ్. 2.75-5

Next Story
Share it