Top
Telugu Gateway

‘గీత గోవిందం’ మూవీ రివ్యూ

‘గీత గోవిందం’ మూవీ రివ్యూ
X

విజయ్ దేవరకొండ. సినిమాకు ప్రస్తుతం ఆ పేరే ఓ బలం. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ రేంజ్ అలా పెరిగింది మరి. అర్జున్ రెడ్డి హీరోగా సినిమా వస్తుందంటే చాలు..యూత్ లో క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. ఇప్పుడు అచ్చం అదే జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’ ఫస్ట్ లుక్ నుంచి పాటల విడుదల వరకూ ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత చూపుతూ ఉత్కంఠ పెంచింది చిత్ర యూనిట్. మరి బుధవారం నాడు విడుదల అయిన సినిమా ఎలా ఉంది?. విజయ్ క్రేజ్ గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాస్తవం మాట్లాడుకోవాలంటే గీత గోవిందం సినిమా కథ కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో చూసిందే. అయితే ఆ లోటును ఎక్కడ కన్పించకుండా విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు తమ నటనలతో ప్రేక్షకులను అలరింపచేస్తారు. అచ్చం ఈ సినిమాలో అదే జరిగింది. అందుకే కథ పాతదే అయినా...కథనంతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. దీంతో అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండకు మరో హిట్ దక్కిందనే చెప్పొచ్చు.

రష్మిక ది కూడా గోల్డెన్ లెగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె చేసిన తొలి సినిమా ఛలో కూడా టాలీవుడ్ లో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు గీత గోవిందం. ఆమె నటన చూసిన తర్వాత కొత్త సినిమాల్లో ఛాన్స్ లు క్యూ కడతాయనటంలో సందేహం లేదు. ఈ సినిమాలో విజయ్‌ ఓ లెక్చరర్‌. చిన్నప్పటి నుంచి ప్రవచనాలు వింటూ పద్ధతి గల కుర్రాడుగా పెరిగాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వెంటే ఆరు నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు. కొద్ది రోజులకు గీత ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్‌. గీత కూడా అదే బస్సులో విజయ్‌ పక్కన సీటులోనే కూర్చుంటుంది. అక్కడే ఆమెకు ముద్దు ఇచ్చి..సెల్ఫీ తీసుకుని విలన్ గా మారిపోతాడు.

అలా గీతకు దూరమైన విజయ్‌ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నదే సినిమా. హీరోయిన్‌ చుట్టూ మేడమ్‌..మేడమ్‌ అంటూ తిరిగే పాత్రలో విజయ్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తన డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్‌లోనూ ఫన్‌ జనరేట్ చేయటంలో విజయ్ దేవరకొండ్ సక్సెస్‌ అయ్యాడు. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ లో కంటతడి పెట్టించే సెంటిమెంట్‌ను పండించాడు. హీరోయిన్‌ గా రష్మిక కూడా తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేసి..తన సత్తా ఏంటో చూపిచాంరు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ చాలా బాగా చూపించారు. చాలా సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతో పోటి పడి నటించారు. ఈ సినిమాలోసుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. గీత గోవిందం సినిమా విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు పరశురాం. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. ఓవరాల్ గా చూస్తే ‘గీత గోవిందం’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.

రేటింగ్. 3.5/5

Next Story
Share it