డీఎస్ తనయుడు సంజయ్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు డీఎస్ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ ఆదివారం నాడు అరెస్ట్ అయ్యారు. ఆయనపై పోలీసులు కొద్ది రోజుల క్రితం నిర్భయ చట్టం కింద కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సంజయ్ తనకు చెందిన శాంకరి కాలేజీలోని విద్యార్ధినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం విచారణకు హాజరైన అనంతరం సంజయ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. తర్వాత అతనిని అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం సంజయ్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్‌పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు.