Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘తాకట్టు’లో ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు ‘తాకట్టు’లో ఆంధ్రప్రదేశ్!
X

సాగునీటి ప్రాజెక్టులు..అమరావతి భూములు...చివరకూ రోడ్లూ తనఖాకే

ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులు. చివరకు అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములు. రహదారులు కూడా తాకట్టులోకే. ఏకంగా చంద్రబాబు సర్కారు అప్పుల దాహానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తాకట్టులోకి వెళుతోంది. నా అనుభవంతో ఏపీని అభివృద్ధి చేస్తాను..నేను తప్ప..ఎవరు ఇలా చేయగలరు అని చెప్పుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారు. బడ్జెట్ లో పేర్కొన్న సుమారు 26 వేల కోట్ల రూపాయలు అప్పులు కాకుండా....ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలకమైన ఆస్తులు అన్నింటిని తాకట్టు పెట్టి ఏకంగా అరవై వేల కోట్ల రూపాయల మేర రుణాలు పొందేందుకు మంత్రివర్గ ఆమోదం పొందారు. ఇది చాలా ప్రమాదకరమైన క్రీడ అని ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాల కోసం అప్పులు చేయటం తప్పు కాకపోయినా ప్రతి ఆస్తిని ఇలా తాకట్టు పెట్టి..ప్రజల భవిష్యత్ ను అంథకారంలోకి నెట్టడం సరికాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ...వేలాది కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రుణాలు పొంది అందినంత దోచుకునేందుకు రకరకాల కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీని కోసమే ఏపీలోని అన్ని కీలక సాగునీటి ప్రాజెక్టులను ఏపీ జలవనరుల అభివృద్ధి సంస్థకు బదలాయించారు. ఈ ప్రాజెక్టులను వాణిజ్య బ్యాంకుల్లో తనఖా పెట్టి ఏకంగా 30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు తెచ్చేసుకున్నారు కూడా. ఆస్తులను తనఖా పెట్టడమే కాకుండా ఈ రుణాలకు సర్కారు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీసీఆర్ డీఏకి సంబంధించి కూడా ఇదే తంతు. రాజధాని భూములను తనఖా పెట్టి పది వేల కోట్ల రూపాయలను తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వాటర్ గ్రిడ్ కోసం తాగునీటి అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి..ఈ ప్రాజెక్టులను తనఖా పెట్టి 5000 కోట్ల రూపాయలు, మునిసిపల్ ఆస్తులు కుదువ పెట్టి పట్టణ మౌలికసదుపాయాల కల్పనా సంస్థ ద్వారా మరో 13 వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చుకోనున్నారు. రహదారులను తాకట్టు పెట్టి 3000 కోట్ల రూపాయల రుణాలు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి ఆస్తిని తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తేవటం వల్ల భవిష్యత్ తరాలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని..అంతిమంగా అది రాష్ట్ర ప్రగతికి పెద్ద అవరోధంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ, అసలు..అంతకంతకు పెరిగే అనుత్పాదక వ్యయం కలసి ఏపీని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it