Telugu Gateway
Andhra Pradesh

భోగాపురం గోల్ మాల్...చంద్రబాబు సర్కారుకు ఏఏఐ నిరసన లేఖ

భోగాపురం గోల్ మాల్...చంద్రబాబు సర్కారుకు ఏఏఐ నిరసన లేఖ
X

సర్కారు కంపెనీలపై నిషేధమా?..ఇదెక్కడి విచిత్రం!

‘మా టెండర్ లో ప్రభుత్వ కంపెనీలు పాల్గొనటానికి అనుమతి లేదు. తొలుత పిలిచిన టెండర్ లో ఆ నిబంధన లేదు. కానీ తర్వాత అది వచ్చి చేరింది. సహజంగా ఎవరైనా పోటీ ఎక్కువ ఉండాలనుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తారు. కానీ ప్రభుత్వ సంస్థలు టెండర్ లో పాల్గొనటాకి అర్హులు కారని ఓ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించటం బహుశా దేశంలో ఎక్కడైనా జరిగిందో లేదో కానీ..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ వింత చోటుచేసుకుంది. ఇదంతా ఎక్కడ అన్నదే కదా మీ డౌట్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ గోల్ మాల్ లో జరిగిన తంతు ఇదంతా. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన భోగాపురం విమానాశ్రయం టెండర్ ను చంద్రబాబు సర్కారు ఏకపక్షంగా రద్దు చేయటంతోపాటు..తర్వాత పిలిచిన టెండర్ లో అసలు ప్రభుత్వ రంగ సంస్థలే పాల్గొనటానికి వీల్లేదంటూ నిబంధన పెట్టడంపై ఏఏఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సర్కారుకు ఏఏఐ అధికారులు నిరసన లేఖ రాశారు. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు టెండర్ లో పాల్గొనే అర్హతల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను తప్పించటం పూర్తిగా ‘ప్రైవేట్ సంస్థల’కు మేలు చేసేందుకే అన్న విషయం స్పష్టం అవుతుందని ఏఏఐ అధికారులు తమ లేఖలో పేర్కొన్నారు. సర్కారు తీరుకు నిరసనగా ఎలా ముందుకెళ్ళాలనే అంశంపై ఆలోచనలు చేస్తున్నట్లు ఏఏఐ అదికారులు తెలిపారని ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

తాజా పరిణామం భోగాపురం విమానాశ్రయం టెండర్ భవిష్యత్ ను గందరగోళంలో పడేసేలా ఉంది. తొలుత భోగాపురం విమానాశ్రయం టెండర్ దక్కించుకున్న ఏఐఐ ఆదాయంలో ఏపీ సర్కారుకు 30.2 శాతం వాటా ఇస్తామన్నా ఈ టెండర్ ను రద్దు చేశారు. అస్మదీయ ప్రైవేట్ సంస్థకు టెండర్ రాలేదనే కారణంతోనే చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 23న కొత్తగా మళ్లీ టెండర్ పిలిచిన ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎడీసీఎల్) అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు అర్హత లేదనే నిబంధన పెట్టింది. అంతే కాదు..తమకు కావాల్సిన వాళ్ళ కోసం రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం అవసరం అని కూడా జోడించారు. అసలు విమానాశ్రయాల అభివృద్ధికి , రియల్ ఎస్టేట్ కు సంబంధం ఏంటో చంద్రబాబు సర్కారుకే తెలియాలి. ప్రభుత్వ రంగ సంస్థలపై నిషేధం విధించే నిర్ణయంలో ఎలాంటి సహేతుకత లేదని ఏఐఐ తన లేఖలో పేర్కొంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన ఏపీఏడీసీఎల్ ఇలా చేయటం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏఏఐ రేసులో ఉండకుండా ఇలా చేశారని భావిస్తున్నారు. ఏపీ సర్కారుకు ఘాటు లేఖ రాసిన ఏఏఐ ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ్రేకులు పడతాయనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it