Telugu Gateway
Andhra Pradesh

బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమంటున్న వైసీపీ

బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమంటున్న వైసీపీ
X

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ జమిలికి జై కొట్టింది. అదే సమయంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తిలేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బిజెపికే కాదు..ఆ పార్టీ నిలిపే మిత్రపక్ష అభ్యర్ధికి కూడా మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టం చేసినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొదటి నుంచి తమ వైఖరి అదేనని..ఇప్పుడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని..కేంద్రంలో ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని జగన్ మొదటి నుంచి చెబుతున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో అధికార టీడీపీ జమిలి ఎన్నికలకు నో చెప్పగా..వైసీపీ మాత్రం సై చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

మంగళవారం లా కమిషన్‌తో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలను ఉద్దేశించి పార్టీ తరఫున తొమ్మిది పేజీల సూచనలను సమర్పించారు. ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు. ముందుగా లోక్‌సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను ప్రశ్నించగా.. రద్దు అయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్‌ సభ్యులు చెప్పారని వివరించారు. జమిలి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరినట్లు తెలిపారు.

Next Story
Share it