చంద్రబాబుకు అవమానం!..సతీష్ చంద్ర తీరుతో కలకలం

ఫోటో క్రెడిట్.ఏబీన్
అది సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక కోసం జరిగిన సమావేశం. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర పాల్గొన్నారు. సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలోజరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు ఆగ్రహాం కూడా వ్యక్తం చేసింది. దీంతో చంద్రబాబు గురువారం నాడు మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫోటో చూసి టీడీపీ వర్గాలు కూడా షాక్ కు గురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి యనమల, మరో అధికారి మామూలుగా కూర్చుంటే సతీష్ చంద్ర మాత్రం కాలుమీద కాలు వేసుకుని కూర్చోవటం విశేషం. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రి యనమల ఉండగా ఇలా కూర్చోవటం ఏ మాత్రం సమర్థనీయం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫోటోతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో సతీష్ చంద్ర చాలా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సతీష్ చంద్ర ఓ వైపు ఫోటోలు...వీడియో తీస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇలా కూర్చోవటం పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఇది ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రి అంటే లెక్కలేని తనమా? లేక చంద్రబాబునాయుడు ఆయనకు ఇచ్చిన అలుసా? అన్న చర్చ కూడా సాగుతోంది. గతంలో ఓ విదేశీ పర్యటన సందర్భంగా కూడా అప్పటి మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు సతీష్ చంద్ర. ఇదిలా ఉంటే సమాచారం హక్కు చట్టం కమిషనర్లుగా రిటైర్డ్ ఐపీఎస్ బీవీ రమణకుమార్, మాజీ ఐఎఫ్ఎస్ ఎం రవికుమార్, న్యాయవాది కట్టా జనార్థన్ పేర్లను ఈ కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ ఆమోదించవలసి ఉంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం గవర్నర్‌కు పంపనున్నారు.