Telugu Gateway
Movie reviews

‘సాక్ష్యం’మూవీ రివ్యూ

‘సాక్ష్యం’మూవీ రివ్యూ
X

బెల్లంకొండ శ్రీనివాస్. టాలీవుడ్ లో ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ దక్కని హీరో. తీసే సినిమాలు అన్నీ రిచ్ గా...గ్రాండ్ గా ఉంటున్నా హిట్ సినిమాకు కావాల్సినంత ‘సరుకు’ మాత్రం అందులో ఉండటంలేదు. ఈ సారి బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. దీనికితోడు టాప్ హీరోలతో వరస పెట్టి సినిమాలు చేస్తున్న భామ పూజా హెగ్డె తోడు. మరి ఈ సారైనా ఈ కుర్ర హీరో గట్టెక్కాడా?. తరచిచూస్తే పాత కథకే ‘పంచభూతాల’ కోటింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పంచభూతాలు అనే కాన్సెప్ట్ మినహా అంతా రొటీన్ వ్యవహారంలాగానే కన్పిస్తుంది. బడ్జెట్ పరంగా...రిచ్ నెస్ పరంగా ఈ సినిమాకు ఏ మాత్రం వంక పెట్టే అవకాశం లేకున్నా సినిమాను వేగంగా నడిపించే శక్తి లేకుండా పోయింది. చాలా సినిమాల్లో ఓ కుటుంబం రౌడీల చేతిలోనే..ప్రమాదం కారణంతోనే మొత్తం మరణించటం. దీనికి కారణమైన వారో ఎవరో తెలుసుకుని వారిని హతమార్చటం హీరో పని. అచ్చం ఈ సాక్ష్యం సినిమాలోనూ అదే సాగింది. ఫ్యామిలీ మొత్తంలో ఎవరూ మిగలకుండా హత్య చేయాలని ప్రత్యర్ధులు ప్లాన్ చేస్తారు కానీ...సినిమా నడవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి...హీరోను ఎలాగోలా తప్పిస్తారు. ఆ హీరో విదేశాల్లో పెరిగి..పెద్దయి ఇండియాకు తిరిగొచ్చి తనకు తెలియకుండానే...తన కుటుంబ సభ్యులను హత్య చేసే కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు.

సినిమాలో అక్కడక్కడ ట్విస్టులు..సంభాషణలు బాగున్నా ఓవరాల్ గా చూస్తే మాత్రం అంత కిక్ రాదు. హీరో, హీరోయిన్ల ప్రేమ కథలో కూడా ఫీల్ తీసుకురాలేకపోయారు. పాటలు కూడా ..సినిమాలో సన్నివేశాలకు ‘సింక్’ కాకుండా ఉండటంతో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వీటిని ఇరికించినట్లు కన్పిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా..భావోద్వేగ సన్నివేశాల సమయంలో తడబడినట్లు కన్పిస్తుంది. హీరోయిన్ పూజా హెగ్డెకు పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్రేమీకాదు. జగపతిబాబు కొత్తతరలహా విలన్ గా కన్పించారు ఈ సినిమాలో. పంచభూతాలు కలసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు సూపర్ హిట్ మాత్రం ఇవ్వలేకపోయాయి అంతిమంగా.

రేటింగ్. 2.25/5

Next Story
Share it