Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి పదవి అడ్డుకునేందుకేనా కొత్త కేసులు!

రేవంత్ రెడ్డి పదవి అడ్డుకునేందుకేనా కొత్త కేసులు!
X

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఈ మధ్య కొత్త కొత్త కేసులు దాఖలు అవుతున్నాయి. సడన్ కు ఎందుకు ఈ కేసులు పుట్టుకొస్తున్నాయి. బినామీ వ్యాపారాలు అంటూ ఓ కేసు...మరో అంశంపై పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు సాగుతోంది. అయితే సడన్ గా ఈ కేసులు ఎందుకు పుట్టుకుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ‘కీలక పదవి’ రాకుండా అడ్డుకునేందుకు ఈ ప్రయత్నాలు అని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరే సమయంలోనే రేవంత్ రెడ్డికి ‘ప్రచార కమిటీ ఛైర్మన్’ వంటి కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇంతటి కీలక పదవి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ లోనే సహజంగా వ్యతిరేకత వ్యక్తం అయింది. అప్పటి నుంచి ఈ పదవి పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని ఒక్క రేవంత్ రెడ్డికే కాకుండా..మరికొంత మందికి కూడా ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు టాక్. అయితే ఈ ప్రతిపాదనను రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్లు సమాచారం. అందుకే ఈ ప్రతిపాదన కూడా ప్రస్తుతం పెండింగ్ లో పడిపోయిందని..ఈ తరుణంలో కొత్త కేసులను తెరపైకి తీసుకొస్తే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేయవచ్చన్నది అధికార పార్టీ నేతల వ్యూహాంగా ఉంది.

టీఆర్ఎస్ లో మాటలతో గారడీ చేయగల నేతలు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్, మంత్రి కెటీఆర్, హరీష్ రావువంటి వాళ్ళు శక్తివంతంగా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుగారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఉన్నంతలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అగ్రనేతలకు ధీటుగా నిలబడగలరు. అయితే ఎలాగైనా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో కీలక పదవి రాకుండా చేసేందుకు అధికార పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోందని..దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ ను ‘ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలనేది వీరి వ్యూహం. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇద్దరూ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించలేరు. ఇక జానారెడ్డి అయితే కీలక సమయంలో ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టగల సమర్థుడు. ఈ తరుణంలో మంచిగా..సమర్థవంతంగా ప్రభుత్వ వ్యతిరేక వాదనను విన్పించే రేవంత్ రెడ్డికి బ్రేకులు వేయగలిగితే చాలా వరకూ తమ పని సులభం అవుతుందనే యోచనలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు. అందుకు తగ్గట్టుగా తమ అధిష్టానం నిర్ణయాలు ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it