Telugu Gateway
Telangana

కెసీఆర్ ఫ్యామిలీ పత్రిక ఆదాయం వృద్ధి రేటు 387 శాతం

కెసీఆర్ ఫ్యామిలీ పత్రిక ఆదాయం వృద్ధి రేటు 387 శాతం
X

ముఖ్యమంత్రి కెసీఆర్ జమానాలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంగతి ఏమో కానీ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన మీడియా సంస్థల ఆదాయాలు మాత్రం జూమ్ జూమ్ అంటూ దూసుకెళుతున్నాయి. ముఖ్యమంత్రే మనవాడైతే సొంత పత్రికలకు వచ్చే ప్రకటనలకు కొరత ఉంటదా?. అచ్చం ఇప్పుడు తెలంగాణలో అదే సాగుతోంది. సర్కులేషన్ పరంగా అగ్రశ్రేణి పత్రికల కంటే కెసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన నమస్తే తెలంగాణ, టీ ఛానల్ లు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనల ఆదాయంలో మాత్రం దూసుకెళుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం ఈ విషయాలను ‘http://www.thehoot.org’ సమగ్ర కథనాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రే మీడియా అధినేత అయితే అనే ‘క్యాప్షన్’తో ఈ వివరాలు పొందుపర్చారు. ఉస్మానియా యూనివర్శిటీ మాజీ ఫ్రొఫెసర్, మీడియా విశ్లేషకురాలు పద్మజా షా ఈ వివరాలతో ఓ స్టోరీ అందించారు. ఆ వివరాలు ఇవే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటన రూపంలో ఆదాయం అందజేయటం అవినీతి అంటారా?. లేక అధికారాన్ని దుర్వినియోగం చేయటం కిందకు వస్తుందా? అన్న ప్రశ్నలను లేవనెత్తారు.

2016 ఏప్రిల్-2017 మార్చి కాలంలో సర్కులేషన్ పరంగా అగ్రస్థానంలో ఉన్న ఈనాడుకు 271 లక్షల రూపాయల ఆదాయం రాగా, ఇదే కాలంలో నమస్తే తెలంగాణకు ఈనాడు కంటే తక్కువే 262 లక్షల రూపాయల యాడ్స్ వచ్చాయి ప్రభుత్వం నుంచి. ఈ కాలంలో సాక్షికి 192 లక్షలు, ఆంధ్రజ్యోతికి 45.6 లక్షల రూపాయల ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. కానీ 2017 ఏప్రిల్-2018 ఫిబ్రవరి వరకూ చూసుకుంటే ఈనాడు ఆదాయం 271.9 లక్షల రూపాయల వద్దే ఉంది. ఇదే కాలంలో సాక్షికి 207 లక్షలు, ఆంధ్రజ్యోతికి 135 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నమస్తే తెలంగాణ ఆదాయం మాత్రం ఏకంగా 1281 లక్షలకు చేరింది. అంటే పెరుగుదల శాతం 387 శాతం అన్న మాట. 2017 జనవరి నుంచి 2018 మే వరకూ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే అధికారిక ఛానల్ అయిన టీన్యూస్ దే హంగామా అని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎక్కువ ఆదాయం సీఎం కుటుంబ సభ్యులకు చెందిన సంస్థకే కావటం విశేషం.

అయితే ‘http://www.thehoot.org’లో లేని విషయం మరొకటి ఉంది. మామూలుగా ప్రచారం చేసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిన వారు ఒకరుండరు అనే అభిప్రాయం ఉండేది. కానీ పత్రికలకు ప్రకటనల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిపోయారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. రాష్ట్రానికి చెందిన పత్రికలకే కాకుండా..జాతీయ స్థాయి, అంతర్ రాష్ట్ర పత్రికలకు కూడా ప్రకటనలు ఇఛ్చి కోట్లాది రూపాయల వ్యయం చేశారు. ఈ పేరుతో ప్రభుత్వ పెద్దలకు చెందిన అస్మదీయులు కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

Next Story
Share it