Telugu Gateway
Andhra Pradesh

‘అవిశ్వాసం’తో చంద్రబాబు అసలు బండారం బయటకు!

‘అవిశ్వాసం’తో చంద్రబాబు అసలు బండారం బయటకు!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరువు ఇప్పుడు జాతీయ స్థాయిలో పోనుందా?. అదేంటి? ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతుంటే పరువు ఎలా పోతుందని అనుకుంటున్నారా?. గత సమావేశాల్లో ఏ మాత్రం అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డుకున్న బిజెపి..ఇప్పుడు వెంటనే ఆమోదించటానికి వెనక ఉన్న కారణాలు ఏంటి?. అంటే బిజెపి అసలు ప్లాన్ అక్కడే ఉందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అసలు రంగును బహిర్గతం చేసేందుకు ఇది తమకు ఓ అద్భుత అవకాశంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చిన మాట వాస్తవం..బహిరంగ రహస్యం. కానీ తర్వాత కేంద్రం రకరకాల కారణాలు చెప్పి ప్రత్యేక హోదా సాధ్యంకాదని తేల్చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా ‘ప్రత్యేక ప్యాకేజీ’ అని ప్రకటించగా...మోడీ..బిజెపి నేతల కంటే ఎక్కువగా అసలు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది..నన్ను ఎడ్యుకేట్ చేయండి.. హోదా పొందిన రాష్ట్రాలు సాధించింది ఏమిటి? అంటూ అడిగిన వారందరిపై దాడి చేసినంత పనిచేశారు చంద్రబాబు.

అంతే కాదు..ప్యాకేజీ ప్రకటించినందుకు గాను అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీలో పలు చోట్ల సన్మానాలు కూడా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు గాను అసెంబ్లీలో కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. దీనికి సంబంధించి వీడియోలు సజీవసాక్ష్యాలుగా ఉన్నాయి. దీనికి తోడు చంద్రబాబు సర్కారులో జరిగిన స్కామ్ లు..ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పోలవరంలో అడ్డగోలుగా అంచనాల పెంపు, కేంద్ర నిధులతో ఇష్టానుసారం చేసిన ఖర్చు వంటి అంశాలు అన్నింటిని బిజెపి ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టడం ఖాయం అని..దీంతో దేశ వ్యాప్తంగా అటు చంద్రబాబు పరువుతో పాటు టీడీపీ పరువు పోవటం ఖాయం అని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అవిశ్వాసం ఛాన్స్ ను బిజెపి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవటం ద్వారా చంద్రబాబు అసలు రంగు బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఓ నేత తెలిపారు. ఇంత కాలంగా బిజెపి నేతలు చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాల గురించే మాట్లాడుతూ వస్తున్నారు. మరి పార్లమెంట్ లో ఎన్ని సంచలన విషయాలు బయటపెడతారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it