Telugu Gateway
Andhra Pradesh

‘భోగాపురం’ టెండర్ డిజైన్ ఎవరి కోసం!

‘భోగాపురం’ టెండర్ డిజైన్ ఎవరి కోసం!
X

2200 కోట్ల నుంచి 4208 కోట్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ‘అస్మదీయ’ కంపెనీ కోసమే ‘భోగాపురం విమానాశ్రయం’ టెండర్ లో అడ్డగోలు నిబంధనలు పెట్టారా?. ఆగమేఘాల మీద బిడ్ పూర్తి చేసి..కావాల్సిన కంపెనీకి టెండర్ అప్పగించేసి ప్రభుత్వ పెద్దలు తమ ‘వాటా’ తాము తీసుకుందామని అనుకుంటున్నారా?. అందుకు అవుననే అంటున్నాయి మౌలికసదుపాయాల శాఖ వర్గాలు. తొలి దశలో 2200 కోట్ల రూపాయలు ఉన్న ఈ విమానాశ్రయం ప్రాజెక్టు వ్యయం...ఇప్పుడు మూడు దశల పేరుతో ఏకంగా 4208 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ లెక్కల్లో కూడా గోల్ మాల్ ఉందని చెబుతున్నారు. మౌలికసదుపాయాల శాఖ వర్గాలు కూడా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా...పెద్దలు ఏమి చెపితే అదే రైట్ అన్న చందంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంలో పరిధిలోని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు దక్కగా...ప్రభుత్వ రంగ సంస్థ అయితే ‘కమిషన్లు’ ఇవ్వదనే ఏకైక కారణంతో ఇప్పటికే ప్రారంభించాల్సిన ఏపీలోని తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి చంద్రబాబునాయుడే బ్రేక్ లు వేశారు.

ఇప్పుడు తాజాగా పిలిచిన టెండర్లలో కూడా అస్మదీయ సంస్థలకు మాత్రమే టెండర్ దక్కేలా డిజైన్ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పిలిచిన టెండర్లలో కూడా ఏదైనా సంస్థ ఏపీ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇవ్వటానికి ముందుకొచ్చినా..ఏదైనా కారణంతో ఆ సంస్థ వెనక్కి వెళితే మిగిలిన సంస్థలను ఆ టెండర్ ను ‘మ్యాచ్’ కావాలని అడుగుతారట.. ప్రభుత్వ సమ్మతి లేకుండా ఏ సంస్థ అయినా ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయటానికి ముందుకొచ్చి రిస్క్ తీసుకోగలదా?. అంటే ప్రభుత్వం కేవలం తమకు నచ్చిన సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు పలు అడ్డగోలు నిబంధనలను తెరపైకి తెచ్చిందని.. ఈ తరహా నిబంధనలు గతంలో ఎన్నడూ చూడలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు..టెండర్లు పూర్తి చేసి ‘లాభం’ పొందేందుకు ‘స్కెచ్’ వేసుకున్నారని చెబుతున్నారు. తొలి నుంచి సీఎం ఈ ప్రాజెక్టును అస్మదీయ సంస్థకు ఇవ్వటానికే ‘డిజైన్ చేశారు. ఈ మధ్య కాలంలోనే వైఎస్ నిర్ణయాన్ని కూడా కాదని..ఆ సంస్థకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it