Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుపై ఐఏఎస్ ల తిరుగుబాటు?!

తెలంగాణ సర్కారుపై ఐఏఎస్ ల తిరుగుబాటు?!
X

తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ లు అందరూ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారా?. అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయానికే రాకపోవటం..అసలు ఏ విషయంపై అయినా ముఖ్యమంత్రితో చర్చిద్దామంటే సాధ్యం కాకపోవటం...ఆయన పిలిస్తే తప్ప...ఏదైనా సమావేశం ఉంటే తప్ప..ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టే అవకాశం లేకపోవటంతో చాలా మంది ఐఏఎస్ లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు..ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సీనియర్ ఐఏఎస్ లు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం నాడు కొంత మంది ఐఏఎస్ లు తమకు సరైన పోస్టింగ్ లు ఇవ్వటం లేదని ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు..ప్రభుత్వంలో సీనియర్ అధికారులుగా ఉన్న బీ ఆర్ మీనా, బీ పీ ఆచార్య, సురేష్ చందా వంటి అధికారులను పూర్తిగా విస్మరించి..అత్యంత జూనియర్లు చేయాల్సిన బాద్యతలను అప్పగించారు. ఇది ఉన్నతాధికారులను అవమానించటం తప్ప..మరేమీ కాదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కెసీఆర్ ఒకరిద్దరికి తప్ప..ఎంత సీనియర్ అధికారికి కూడా కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రారని..సీఎంను కలవాలని అపాయింట్ మెంట్ కోరినా ఆ సమాచారం కూడా ఆయన వరకూ చేరకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని సీనియర్ అధికారులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని..గతంలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థితులు లేవని చెబుతున్నారు. సీఎం సచివాలయానికి రాకపోవటం ఒకెత్తు అయితే...నెలలో కొన్ని సార్లు కూడా అసలు సీనియర్ అధికారులతో సమావేశం కాకపోవటం వల్ల అసలు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు సమాచారం చేరటంలేదని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఓ రిటైర్డ్ అధికారే అంతా తానే అయి చక్రం తిప్పుతుండటంతో ఆ ప్రభావం పరిపాలనపై తీవ్రంగా పడుతోందని...అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలకు కూడా ఆ ఛాన్స్ దక్కటం లేదని ఓ వైపు రాజకీయ విమర్శలు ఉన్న సమయంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారుల నుంచి కూడా ఇదే తరహా విమర్శలు రావటం విశేషం.

Next Story
Share it