Telugu Gateway
Top Stories

మహిళలకు చేతికి ‘స్టీరింగ్’

మహిళలకు చేతికి ‘స్టీరింగ్’
X

అక్కడ నిషేధానికి కాలం చెల్లింది. మహిళల చేతికి స్టీరింగ్ వచ్చింది. ఇంటిని చక్కదిద్దటమే కాదు..రోడ్లపై రయ్యిన కార్లను కూడా నడిపే అవకాశం వారికి దక్కింది. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్‌ సల్మాన్‌ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్‌ 24 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ఈ నిర్ణయంతో తాజాగా పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయని చెబుతున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరిన వారికి కొందరు మహిళలు పూలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్‌ మధుర క్షణాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్‌ అల్మోగ్రెన్‌ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సౌదీ యువరాజు అల్‌వలీద్‌ బిన్‌ తలాల్‌ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె ఎస్‌యూవీ కారును డ్రైవింగ్‌ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్‌ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్‌ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story
Share it