Telugu Gateway
Telangana

అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు పెంచొచ్చా?

అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు పెంచొచ్చా?
X

రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచొచ్చు. . ఎమ్మెల్యేలు...మంత్రులు జీతాలు పెంచుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ వేస్తారు.గడువు ప్రకారం నివేదిక వచ్చేలా చూస్తామని హామీ ఇస్తారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ ఇవ్వకుండా ఉండటానికి ఎక్కడా లేని విధంగా కాగ్ ను తెరపైకి తెస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం జీతాలు పెంచమంటే నష్టాల్లో ఉన్న సంస్థ కాబట్టి జీతాలు పెంచం. సమ్మె చేస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తాం. ఆర్టీసీ మూసేస్తాం అంటూ కెసీఆర్ చేసిన ప్రకటన ప్రభుత్వ వర్గాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ. కానీ తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు జీతాల పెంపు కోరుతూ సమ్మె నోటీసులు ఇస్తే వాళ్లకు వార్నింగ్. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ వేసి గడువులోపు పెంపుదల చేస్తామంటూ అనునయింపులు. ఎందుకంటే వీళ్ళ సంఖ్య ఎక్కువ. వీళ్ళ ఓట్లు అవసరం కనుక. కానీ ఆర్టీసీ అనేసరికి మాత్రం బెదిరింపులు. ఆర్టీసీ యూనియన్ల డిమాండ్లు సహేతుకంగా లేకపోయి ఉండొచ్చు. యూనియన్లు..ప్రభుత్వ ప్రతినిధులు చర్చకు కూర్చుని మధ్యేమార్గంగా ఓ నిర్ణయానికి రావొచ్చు. అంతే కానీ సమ్మె నోటీసు ఇచ్చారు కాబట్టి ఉద్యోగాల్లో నుంచి పీకేస్తాం..లేదంటే ఆర్టీసీని మూసేస్తామంటూ ఏకంగా ముఖ్యమంత్రి కెసీఆర్ బెదిరింపులకు దిగటం ఏ మాత్రం సమర్థనీయంగా కాదని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కెసీఆర్ కు కావాల్సినప్పుడు సకల జనుల సమ్మె సమయంలో ఎన్ని రోజులు అయినా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయాలి. కానీ అందరితో పాటు తమకూ జీతాలు పెంచాలని వాళ్ల కష్టాల కోసం మాత్రం సమ్మె చేస్తే ఇదే కెసీఆర్ వారిపై కఠిన చర్యలు అంటూ హెచ్చరికలు జారీ చేస్తారు. ఏ సంస్థ అయినా..ప్రభుత్వం అయినా పక్కదారి పట్టింది అంటే యాజమాన్యం...ప్రభుత్వాన్ని నడిపే వారిదే బాధ్యత తప్ప..ఉద్యోగులది ఎలా అవుతుంది?. గతంలో తాను రవాణా శాఖ మంత్రిగా పనిచేశానని..ఆర్టీసి లాభాల్లోకి తెస్తానని కెసీఆర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రకటించారు. కానీ సంస్థ నిర్వహణ సమర్థతను పక్కన పెట్టి అస్మదీయుడైన జె వి రమణరావును ఎండీగా నియమించారు. ఈడీగా పదవి విరమణ చేసిన ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినా ఆర్టీసీ వంటి సంస్థ నిర్వహణ కు సమర్థుడు కాదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆర్టీసీ ఎండీలుగా ఐఏఎస్ అధికారులనే నియమించేవారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రం ఏపీలో అలాగే కొనసాగుతుంది. ఇక్కడ మాత్రం కెసీఆర్ తన మనిషి కోసం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. ఆర్టీసీ నష్టాలకు భారీగా పెరిగిన డీజిల్ రేట్లతోపాటు...నిర్వహణ లోపాలు కారణం అని..దానికి కార్మికులను బాధ్యులు చేస్తే ఎలా అని కొంత మంది యూనియన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కెసీఆర్ వైఖరి తీవ్ర విమర్శల పాలు అవుతోంది.

Next Story
Share it