Telugu Gateway
Telangana

కాగ్ పేరుతో ‘కెసీఆర్ డబుల్ గేమ్’

కాగ్ పేరుతో ‘కెసీఆర్ డబుల్ గేమ్’
X

ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అడ్డువచ్చిన కాగ్...ఆర్టీసీ ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి మౌనంగా ఉంటుందా?. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా కాగ్ ను బూచిగా చూపిన తెలంగాణ సీఎం కెసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే తక్కువ వేతనాలు, ఎక్కువ పని ఉండే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఐఆర్ ఇవ్వటంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ తీరే ఉద్యోగుల విషయంలో ఒక రకంగా, ఆర్టీసీ విషయంలో మరో రకంగా ఉంది. తొలుత అసలు సమ్మె చేస్తే ఆర్టీసీని మూసేస్తాం..ఉద్యోగులు అటు నుంచి అటే ఇంటికిపోవాలని హెచ్చరించిన కెసీఆర్ సడన్ గా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీని వెనక కారణాలు ఏంటి?. ఓ వైపు సీఎం మాత్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఘాటు హెచ్చరికలు చేస్తే...చర్చలు ఫలించిన తర్వాత మాత్రం మంత్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉధ్యోగుల కృషి మరవలేనిదని ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ ఘోరపరాజయం చవిచూసింది.

మళ్లీ ఆర్టీసీ ఎన్నికల్లో నూ ఓడిపోతే ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై కూడా ఉంటుందనే భయం సర్కారులో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా ఏడాది కాలం కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇఛ్చే విషయంలో సర్కారు చెప్పిన ‘కాగ్ అభ్యంతరాల’ కారణాలను పత్రికలు పతాక శీర్షికల్లో వేశాయి. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటే కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని అప్పటికి దాన్ని స్కిప్ చేశారు. అయినా ప్రభుత్వ ఉద్యోగులు మౌనం దాల్చారు. ఇప్పుడు అదే సర్కారు ఆర్టీసీ ఉద్యోగుల దగ్గరకు వచ్చే సరికి కాగ్ ను పక్కన పెట్టి నిర్ణయం తీసేసుకున్నారు.

నిజానికి కాగ్ విషయంలో రాజకీయ పార్టీలు అన్నీ ప్రతిపక్షంలో ఉండగా ఒట మాట..అధికారంలో ఉండగా ఒక మాట మాట్లాడటం అందరూ చూస్తున్నదే. ఇందుకు టీఆర్ఎస్ కూడా మినహాయింపు ఏమీ కాదు. కాకపోతే టీఆర్ఎస్ సర్కారు ఓ అడుగుముందుకు వేసి మరీ అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పులు తెచ్చిన డబ్బులను కూడా ఆదాయం గా చూపించి...తెలంగాణ ‘మిగులు’ రాష్ట్రం అంటూ ప్రచారం చేసుకున్నారు. దీనిపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా సర్కారు లైట్ తీసుకుంది. కానీ అవసరమైన సమయంలో తాను తప్పించుకునేందుకు మాత్రం ‘కాగ్’ను ఓ అస్త్రంగా వాడుకుంటుంది.

Next Story
Share it