Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ కు ‘అస్త్రాన్ని’ అందించిన కెసీఆర్

కాంగ్రెస్ కు ‘అస్త్రాన్ని’ అందించిన కెసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఎలా పోరాటాలో అర్థం కాకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీఎం కెసీఆర్ ఓ అస్త్రాన్ని అందించారు. ‘ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యత్వాల రద్దు’ అంశం నిత్యం పత్రికల్లో నానటం వల్ల అంతిమంగా అది టీఆర్ఎస్ కు నష్టం చేయటం ఖాయం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. సభలో జరిగిన గొడవ కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంతప్ ల సభ్యత్వం రద్దు చేశారు. అంతే కాదు ఆగమేఘాల మీద వీరి సీట్లు ఖాళీ అయినట్లు నోటిఫై చేయటంతోపాటు ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని పంపారు. కానీ కోమటిరెడ్డి, సంపత్ లు కోర్టుకు వెళ్లటంతో సీన్ రివర్స్ అయింది. సభ్యత్వాల రద్దు కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా సాగిపోయింది. సభ్యుల నుంచి వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకోవటంతో హైకోర్టు కూడా సభ్యత్వాల రద్దు చెల్లదని తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినా అక్కడా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు కోర్టు ధిక్కరణ పిటీషన్ తో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

కోమటిరెడ్డి చర్యను అందరూ తప్పుపట్టినా కూడా..సభ్యత్వ రద్దు వంటి కఠిన నిర్ణయం తీసుకోవటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయం కొంత మంది మంత్రుల్లోనూ ఉంది. ఇప్పటికే సీఎం కెసీఆర్ పై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఉన్నాయి. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సమయం ఇవ్వరని. ఆయన కలవాలనుకుంటే తప్ప..మంత్రులు అయినా అంత తేలిగ్గా సీఎంను కలవటం కష్టం అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. అదే సమయంలో కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ప్రభుత్వం మరీ నిరంకుశంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం బలపడితే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తాజాగా వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ లోనూ వ్యతిరేక తీర్పు వస్తే అది తమను మరింత చిక్కుల్లో పడేస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట జరిగే ప్రచారానికి..ప్రభుత్వ చర్యలు కనెక్ట్ అవుతుండటం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Next Story
Share it