Telugu Gateway
Andhra Pradesh

దీక్షలు చేసే సీఎంలకు అది వార్నింగ్ బెల్

దీక్షలు చేసే సీఎంలకు అది వార్నింగ్ బెల్
X

పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే..అది వదిలేసి ఏకంగా ముఖ్యమంత్రులే దీక్షలు చేయటం ప్రారంభించారు. రాజకీయాల్లో ఈ మధ్య ఇది కొత్త ట్రెండ్ గా మారింది. ఈ మధ్యే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఖరీదైన’ దీక్షలు చేశారు. చేస్తున్నారు కూడా. విభజనతో నష్టానికి గురైన ఏపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్యాయం చేసిందనటంలో ఎవరికీ రెండవ అభిప్రాయం లేదు. కానీ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే దీక్షలు చేస్తే...ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి. రాజకీయంగా టీడీపీ ఎలాంటి పనిచేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఓ ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో అట్టహాసంగా టెంట్లు వేసుకుని...ఏసీలు పెట్టుకుని..ట్రాఫిక్ మళ్లింపులు చేసి..బస్సుల్లో జనాన్ని తెచ్చుకుని దీక్ష చేయటమే విచిత్రం. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే నాలుగు అడుగులు ముందే ఉన్నారు.

ఆయన ఏకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లోనే దీక్షల మకాం వేశారు. ఈ వ్యవహారం కోర్టుకెక్కటంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. అసలు డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఆఫీస్ వద్ద దర్నా చేయడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎవరు అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. కేజ్రీవాల్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు డిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గత వారం రోజులుగా కేజ్రీవాల్ ఆయన మంత్రులు కొందరు లెప్టినెంట్ గవర్నర్ వెయిటింగ్ హాలులో దర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ కేసు హైకోర్టు కు వచ్చింది. మంత్రి సత్యేంద్ర జైన్ దీక్షలో అస్వస్థతకు గురి కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షల విషయంలో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రంలోని మోడీ సర్కారు అండతోనే ఐఏఎస్ అధికారులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it