మోడీ కుంభకోణాన్ని బయటపెడతామంటున్న ఏపీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సాగుతున్న కుంభకోణాలపై కేంద్రం దృష్టి పెట్టిందనే జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ సంచలన ప్రకటన చేసింది. మోడీ సర్కారులో జరిగిన భారీ కుంభకోణం బయటకు తీస్తున్నామని..దీంతో కేంద్రంలో ప్రకంపనలు ఖాయం అని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రకటించారు. అన్ని ఆధారాలతో ఈ కుంభకోణాన్ని బయటపెడతామన్నారు. అంతే కాదు..దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేస్తామని తెలిపారు. మోడీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ది చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతుందని కుటుంబరావు తెలిపారు. మంగళవారం నాడు విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చూస్తూ ఉండండి..ఖచ్చితంగా ప్రకంపనలు రావటం ఖాయం అంటున్నారు. అదే సమయంలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై కుటుంబరావు తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ నేతల ధోరణి సరైంది కాదని, రాష్ట్రంపై కేంద్రం చాలా వివక్ష చూపిస్తోందని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ. 350 కోట్లు కేంద్రం తిరిగి తీసుకుందని అన్నారు. ఆ నిధులు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ఎప్పుడు నిధులు అవసరం ఉంటే అప్పుడు ఇవ్వాలని.. అలా కుకుండా నెమ్మదిగా ఇస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తేరుకుని అబద్దాలు చెప్పకుండా నిజాలు ప్రజలకు చెప్పాలని సూచించారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో కమిటీ వేసి వాస్తవాలు నిర్ధారించుకుందామా? అని ప్రశ్నించారు. అసలు యూసీలు అడగటానికి జీవీఎల్ ఎవరు? అని ప్రశ్నించారు. నిధుల మళ్లింపు, యూసీల విషయంలో సమావేశం ఏర్పాటుకు తాము రెడీ అని...తప్పని తేలితే క్షమాపణ చెప్పటానికి రెడీ అన్నారు.