Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లారా?

చంద్రబాబు కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లారా?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని భుజం తట్టి అభినందించిన అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పరిణామాలపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు బిజెపి నేతలు కూడా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కొత్త పెళ్లికూతురిని వెతుక్కునే పనిలో ఉన్నారని..అందుకే బెంగళూరులో కాంగ్రెస్ తో చేతులు కలిపారని ఆరోపించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ‘జెడి(ఎస్) ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్లారు. కాంగ్రెస్ పిలిచిందని వెళ్లలేదు అనేది గుర్తుంచుకోవాలి. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక చంద్రబాబుదే. దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్ ప్రధాని కావడంలో కీలకపాత్ర చంద్రబాబుదే. దేవెగౌడతో సాన్నిహిత్యం,కుమార స్వామి ఆహ్వానం మేరకే బెంగళూరు వెళ్లారు. అందుకే ప్రమాణ స్వీకారంలో భాగం పంచుకున్నాం. ప్రాంతీయపార్టీలు,వామ పక్షాల నేతలతో తన ఛాంబర్ లో చర్చలు జరిపారు. కాంగ్రెస్ మంత్రుల ప్రమాణానికి సోనియా,రాహుల్ హాజరయ్యారు.

వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారం. భారతీయ సంస్కారాన్ని కూడా తప్పు పట్టడం బిజెపి,వైసీపి సంస్కృతి. శాసనసభలో జాతీయగీతం వస్తుంటే సభనుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతి. కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లలేదు. ఎదురైతే అభినందించడాన్ని తప్పుపట్టడం దివాలాకోరుతనం. ఓట్ల కోసం వచ్చిన కోవింద్ కాళ్లు ఏ1,ఏ2 నిందితులు పట్టుకోవడాన్ని ఏమనాలి.?ఢిల్లీలో కేంద్రపెద్దల ఛాంబర్లకు జగన్ వెళ్లి కాళ్లు పట్టుకోవడాన్ని ఏమనాలి..?బెంగళూరు ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదు..? కర్ణాటకలో బిజెపికి పనిచేశావు కాబట్టే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ వెళ్లలేదు. 2019లో బిజెపితో పొత్తుకోసమే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదు. బిజెపితో తన పొత్తు చెడిపోతుందనే భయంతోనే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ గైర్హాజరు.

జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకున్న ఇమేజి దేశంలో అందరికీ తెలిసిందే. కాళ్లు పట్టుకునే రాజకీయాల్లో అందెవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డిదే. యునైటెడ్ ఫ్రంట్,నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబుదే ప్రధాన భూమిక. చంద్రబాబుకున్న ఘన చరిత చూసే బెంగళూరులో అన్నిపార్టీలు గౌరవించాయి. బిజెపి తప్ప ఎవరూ జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ కలుపుకుపోదు. కర్ణాటకలో గాలి జనార్ధన రెడ్డితో ,ఏపిలో జగన్మోహన్ రెడ్డితో బిజెపి వెళ్తోంది. వేదికపై కలిస్తే చిలవలు పలవలు సృష్టించడం వైకాపా నీచ సంస్కృతి. 2019 ఎన్నికల్లో 25పార్లమెంట్ స్థానాలలో టిడిపి ఘనవిజయం ఖాయం. కేంద్రంలో రాబోయేది బిజేపీయేతర ప్రభుత్వమే. దానికి నాంది బెంగళూరులో ప్రాంతీయపార్టీలు,వామపక్షాల భేటి. బిజెపికి వైఎస్సార్ కాంగ్రెస్ తో ఎంగేజ్ మెంట్ ఇప్పటికే అయ్యింది. ముహూర్తం కూడా 2019గా నిర్ణయించారు. చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనేదే బిజెపి,వైకాపా కుట్రలు. నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారు’ అని యనమల వ్యాఖ్యానించారు.

Next Story
Share it