Telugu Gateway
Telangana

కెసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఆయన సడన్ గా తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీని వెనక బలమైన కారణం కూడా ఉంది. సీఎం కెసీఆర్ అకస్మాత్తుగా గా ఓటుకు నోటు కేసును సమీక్షించటంతో ఆయన బయటకు వచ్చారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేదిలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కెసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని ప్రకటించారు. ప్రధాని మోడీని వ్యతిరేకించారని చంద్రబాబును..కెసీఆర్ పై పోరాటం చేస్తున్నందున తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే కెసీఆర్ ఈ ప్లాన్ అమలు చేస్తున్నట్లు ఆరోపించారు.

మోడీని చంద్రబాబు సవాల్ చేయటం కెసీఆర్ కు ఏ మాత్రం మింగుడుపడటం లేదన్నారు. పాత కేసులను సమీక్ష పేరుతో రాజకీయ, ఆర్థిక లబ్ది పొందేందుకే కెసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ రాష్ట్రంలో విస్తృతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నాలుగేళ్లలో కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్‌ బంధువైనా, ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తైనా దర్జాగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కిన అధికారి సంజీవరావును ఇంకా పదవిలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. నిమ్స్ వైద్యుడి విషయంలోనూ ఇలాగే చేశారన్నారు. ఏసీబీ, ముఖ్యమంత్రి వ్యవహార శైలి సరిగా లేదని అన్నారు. తెలంగాణ ఏసీబీ 2016లో 125 కేసులకు ఆధారాలు లేవంటూ వాటిని మూసేసిందని చెప్పారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో వెల్లడించిన నివేదికలో ఈ విషయం ఉందని తెలిపారు. మోడీ, కేడీల నాటకంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని అన్నారు.

Next Story
Share it