ఏపీలోనూ ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ రాజకీయాలపైనా దృష్టి సారించనున్నారా?. అంటే అవునంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఇఫ్పటికే ప్రకాష్ రాజ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా సమాజంలో అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తుందనేది ప్రకాష్ రాజ్ వాదన. అందులో భాగంగానే బిజెపికి వ్యతిరేకంగా కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆయన నేరుగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా..కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ప్రకాష్ రాజ్ ఏపీలోనూ ఇదే తరహా కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఏపీలో బిజెపి ఉనికే ప్రశ్నార్థం. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ పని ప్రారంభిస్తారు అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.